భట్టి సవాలును స్వీకరించి తలసాని

భట్టి ఇంటికెళ్లిన మంత్రి తలసాని

Minister Talasani Srinivas Went To Bhatti Vikramarka Home

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరూ సవాళ్లు కూడా విసురుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి తలసాని ఈ రోజు ఉదయం భట్టి విక్రమార్క ఇంటికి వచ్చారు. ఆయన వస్తారని ఊహించని భట్టి మొదటి షాక్ అయ్యారు. అనంతరం ఇంట్లోకి రమ్మని పిలిచి, ఇంట్లో కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. నగరంలో తమ సర్కారు నిర్మించిన ఇళ్లను చూపిస్తామని తమతో రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో భట్టి విక్రమార్క అందుకు ఒప్పుకున్నారు. అనంతరం వారిద్దరు ఒకే కారులో ఇళ్లను చూడడానికి బయలుదేరారు.

కాగా, నిన్న తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతోన్న సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు గుప్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై ఆయన ప్రశ్నించారు. ఆయా ప్రాంతాల్లో ఆ వసతులు ఉన్నాయంటే గతంలో కాంగ్రెస్ చేసిన పనుల వల్లేనని, టీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదని అన్నారు. దీంతో ఆయనపై తలసానితో పాటు పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో భట్టి మళ్లీ కలుగజేసుకుని మంత్రి కేటీఆర్‌ తన ప్రసంగంలో లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడే ఇళ్లు గుర్తుకొస్తాయా? అని ఎద్దేవా చేశారు. నగరంలో లక్ష ఇళ్లు ఎక్కడ నిర్మించారో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో తలసాని ఆ సమయంలో మాట్లాడుతూ… రేపు ఉదయం భట్టి ఇంటికి వస్తానని, నగరంలో ఎక్కడెక్కడ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించారో స్వయంగా చూపిస్తానని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/