తెలుగు రాష్ట్రాలలో ఎండ చండప్రచండం

వడగాలుల తీవ్రత కూడా అధికం

Sunstroke
Sunstroke

Amaravati, Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ఎండ మండిపోతున్నది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఎండలతో పాటుగా వడగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది.

ఒకవైపు కరోనా ఇబ్బందులు పెడుతుంటే మరో వైపు ప్రచండ భానుడి ఎండ తీవ్రత ఎక్కువైంది. లాకడౌన్‌ సడలింపులు ఇచ్చినా చాలామంది బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు.

బయటకు వెళ్తే ఎక్కడ వడదెబ్బ తగులుతుందో అని భయపడుతున్నారు.

ఈ ఎండలు మరో మూడు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నది. మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలియజేసింది.

అయితే ఒకటి రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్‌ ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ విూదుగా ఉపరితల ద్రోణి ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఈ రెండు మూడు రోజులపాటు ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని అధికారులు
అంటున్నారు.

రోహిణీ కార్తె ప్రవేశంతో భానుడు భగభగమంటున్నాడు.

రోహిణి కార్తెలో రోళ్ళుపగిలేలా ఎండలు మండుతాయన్న మేరకు భానుడు నిప్పులుచెరుగుతున్నాడు. 

 ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, చిన్నారులు వడదెబ్బ బారిననపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళలోనే పనులు ముగించుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఎండలో తిరుగుతూ పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగానే సుమారుగా ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని నీటిని తాగాలి.

రోజుకు కనీసం ఐదు లీటర్ల శుద్ధమైన నీటిని తాగాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలను సేవించాలని సూచిస్తున్నారు .

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/