కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలు

పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్
జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దిశ హత్య కేసు నిందితులు

cherlapally jail
cherlapally jail

హైదరాబాద్‌: చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దిశ హత్య కేసు నిందితులు జైల్లో ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దిశ హత్య కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలనే పోలీసుల పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. నిందితులను లోతుగా విచారించేందుకు వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దిశ మొబైల్ ను రికవరీ చేయాలని, నిందితుల స్టేట్ మెంట్లను రికార్డు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ఈరోజు షాద్ నగర్ కోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో, నిందితులను కస్టడీలోకి తీసుకునే సమయంలో నిరసనకారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే జైలు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అవసరమైతే జైల్లోనే ఐడింటిఫికేషన్ పరేడ్ నిర్వహించే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/