బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ ప్రమాదాలపై నివేదిక!

పూర్తిస్థాయిలో భూసేకరణ చేసి ఉంటే బాగుండేది

Biodiversity Flyover
Biodiversity Flyover

న్యూఢిల్లీ: హైదరాబాద్ బయోడైవర్సిటీ వంతెన నిర్మాణంపై ప్రమాదాలకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన కమిటీని జీహెచ్ఎంసీ నియమించింది. ఫ్లై ఓవర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వంతెన నిర్మాణానికి సరిపడా భూసమీకరణ చేయకుండా రాజీపడినట్టు నివేదిక పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగానే వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ వేగంగా వెళ్లే వాహనాలకు అది సురక్షితం కాదని నివేదిక పేర్కొంది. వాహనాల వేగం 40 కిలోమీటర్లకు మించకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలో వంతెన డిజైన్, నాణ్యత, ఇతర అంశాల గురించి పేర్కొన్నారు. వంతెన నిర్మాణంలో ఇంజనీర్లు మరింత ముందుచూపుతో వ్యవహరించి ఉంటే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్‌సీ) ప్రమాణాల ప్రకారమే వంతెన నిర్మాణం జరిగినప్పటికీ మలుపుల విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలను పక్కనపెట్టారని పేర్కొంది.

బ్రిడ్జిపై వేర్వేరు చోట్ల, ఎత్తుల్లో వేగాన్ని నిరోధించేందుకు రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. వంతెనపై సెల్ఫీలు తీసుకోకుండా మూల మలుపు దగ్గర క్రాష్ బారియర్స్‌పై 1.5 మీటర్ల ఎత్తున పరదా లాంటి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. నివేదికలో సూచించిన చర్యలు పూర్తయిన తర్వాత నిపుణుల కమిటీ మరోమారు వంతెనను పరిశీలిస్తుంది. అనంతరం వంతెన ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/