సమానత్వం, సాధికారత కోసం మహిళా లోకం మరో పోరాటం నిర్వహించాలి

సైఫాబాద్‌, : సమానత్వం, సాధికారత కోసం మహిళా లోకం మరో పోరాటం నిర్వహించాలని డిఆర్‌డిఓ అసోసియేట్‌ డైరెక్టర్‌ జి.రోహిణి పిలుపునిచ్చారు. మహిళలు అణిచివేత నుంచి విముక్తి చెందాలని ఆమె సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మహిళా సమాఖ్య, తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం (ఎఐటియుసి) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సత్యనారాయణరెడ్డి భవన్‌లో ‘పెట్టుబడిదారి దోరణులు, ఫాసిస్టు శక్తులను తిప్పికోట్టడం, మహిళా సాధికారతను సాదిద్ధాం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. మానవ జాతి మనుగడకు మూలం మహిళలని, మహిళలు ప్రగతి రంగంలో సాధికారత సాధించవలసిన అవసరం ఎంతో ఉందని ఆమె స్పష్టం చేశారు. యునైటేడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ చిక్కడపల్లి బ్రాంచీ మేనేజర్‌ అన్నపూర్ణ మాట్లాడుతూ ఉద్యోగ రంగంలో అటుపోట్లు ఎదురవుతున్న మహిళలు నిలబడి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు పి.ప్రేమ్‌పావని మాట్లాడుతూ హక్కులు, సమానత్వం, స్వేచ్ఛా, సమాన వేతనాల కోసం మహిళా లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షురాలు ఎస్‌.ఛాయాదేవి, సమాఖ్య కార్యనిర్వహక అధ్యక్షురాలు ఎస్‌.జ్యోతి, నాయకురాళ్లు ఎన్‌.కరుణకుమారి, సృజన, తదితరులు పాల్గొన్నారు.