ఓయూలో జూన్‌ 17న స్నాతకోత్సవం

Osmania University
Osmania University

హైదరాబాద్‌: జూన్‌ 17న ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఆరేళ్ల విరామం తరువాత మళ్లీ ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 80వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్, ఓయూ రసా యన శాస్త్ర పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ ఎస్. చంద్రశేఖర్ హాజరుకా నున్నారు. ఆయన స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరించడంతో పాటు పట్టాలను ప్రదానం చేయనున్నారు. పీహెచ్‌డీ పట్టాలతో పాటు వివిధ పీజీ కోర్సులు, ఎంఫిల్, పీహెచ్‌డీలలో బంగారు పతకాలను ఈ వేదిక నుంచి ప్రదానం చేయనున్నారు. జూలై 2012 నుంచి జూన్ 2018 మధ్య పరీక్షలు ఉత్తీర్ణులైన వారు, వచ్చే నెల 11వ తేదీ వరకు పీహెచ్‌డీ పట్టా పొందిన వారు స్నాతకోత్సవంలో పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిం చారు. దీని కోసం ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in ను సందర్శించి, తమ పేరు నమోదు చేసుకుని, సంబంధిత రుసుమును గురువారం నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఇప్పటికే తమ పట్టాలు పొందినవారు దీనికి దరఖాస్తు చేయకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కూడా హాజరుకానున్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/