పరిషత్తు ఎన్నికల్లో పార్టీలు కాదు… ప్రత్యర్థుల ఓటమే లక్ష్యం

Mandal Parishad Office
Mandal Parishad Office

హైదరాబాద్‌: గ్రామ పంచాయితీ ఎన్నికలకు కొంత పై స్థాయి ఎన్నికలుగా జరుగుతున్న జిల్లా, మండల ప్రాదేశిక నియోజక వర్గాల ప్రజా ప్రతినిధుల ఎన్నికలు తెలంగాణలో ఆసక్తికరంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లే ఈ ఎన్నికల్లోనూ తీవ్రంగా తలపడుతున్నా యి. పార్టీల పరంగా రాష్ట్ర స్థాయిలో ఉప్పు నిప్పులా గా ఉన్నప్పటికీ కింది స్థాయి నేతల్లో జెడిపిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి కొంత ప్రత్యేకత కనిపిస్తున్నది. పార్టీలు వేరైనా కొన్నిచోట్ల ఇరు పార్టీల నేతలు కొందరు కలిసి ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలనే విషయంలో వ్యూహ రచన చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. పార్టీల అధిష్ఠానాల ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ ఎవరికి వారుగా తమమత ఉనికి దెబ్బతగిలే విషయాల్లో మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తూ, లోపాయికారిగా ప్రత్యర్థిని దెబ్బతీసే పనిలో వారు నిమగ్నమయ్యారనే అభిప్రాయం వ్యక్త మవుతున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఖమ్మం, వరం గల్‌ ఇతర పాత జిల్లాల్లో టిఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల నేతలకు, అప్పటికే అధికార పార్టీలో ఉన్న వారికి పొసగకపోవడం దీనికి ఒక కారణం కాగా, పదవులను ఆశించి టిఆర్‌ఎస్‌లో చేరిన నేతల అసలు బలం ఎంతో పార్టీ అధినేతకు తెలియజెప్పే ఏకైక ఆయుధంగా ఈ పరిషత్‌ ఎన్నికలు వారికి కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వరంగల్‌ జిల్లాలో మొదటి నుంచి టిఆర్‌ ఎస్‌ పార్టీలో ఉన్న వారికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అంటే పాత వరంగల్‌ జిల్లాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వారికి గుర్తింపు లేనట్లుగా వారు భావిస్తున్నారు. పైగా ఈ జిల్లా నుంచి ఇక కొత్తవారికి కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు లభించడం దాదాపు సాధ్యం కాదనే విధంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ సత్తా చాటుకునేందుకు ఈ ఎన్నికలను ఒక అవకా శంగా ఇతర అసంతృప్త నేతలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదే విధంగా ఖమ్మం పాత జిల్లా పరిధి లోనూ, ఆదిలాబాద్‌ తోపాటు పలు జిల్లాల్లో టిఆర్‌ఎస్‌ లో చేరిన వారికి,మొదటి నుంచి ఉన్న వారి మధ్య అగాధం నెలకొన్నట్లుగా తెలుస్తున్నది.