కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపలేం

High Court
High Court

హైదరాబాద్‌: హైకోర్టులో ఈరోజు మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చునన్న సూచించింది. పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన 60 మంది నిర్వాసితుల పరిహారాన్ని వారి లాయర్లకు అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా నిర్వాసితులకు పరిహారాన్ని అందజేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 కేసులను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించింది. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/