రూ. 200 కోట్లకు చేరువలో మెట్రో నష్టాలు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతికి ఎదురుచూపులు

HYDERABAD METRO RAIL (HMRL)
HYDERABAD METRO RAIL

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో క్రమంగా నష్టాల్లో కూరుకుపోతోంది. సర్వీసులు నిలిచిపోయినా రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం నెలకు రూ. 50 కోట్ల వరకు అవుతోంది. ఫలితంగా ఈ నెలాఖరు నాటికి మెట్రో నష్టం రూ. 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సర్వీసుల పునఃప్రారంభానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రైళ్లు కదలాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోకు అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నారు. అయితే కొవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఉన్నతాధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజానికి మెట్రోకు ప్రయాణికుల నుంచి 45 శాతం మాత్రమే ఆదాయం రాగా, 50 శాతం వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా వస్తుంది. మిగతా ఐదు శాతం మాత్రం వాణిజ్య ప్రకటనల ద్వారా వస్తుంది. అయితే, గత నాలుగు నెలలుగా ఇవేవీ లేకపోవడంతో మెట్రో నష్టాల బారిన పయనిస్తోంది.


మరోవైపు మెట్రో స్టేషన్లు, ప్రయాణికులు వినియోగించే కామన్‌ ప్రాంతాలు, రైలు బోగీలను కోవిడ్‌- 19 నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేసి వినియోగంలోకి తీసుకొస్తామని, ప్రయాణికుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని మెట్రో వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. స్టేషన్‌లోనికి ప్రవేశించే సమయంలో ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ సైతం నిర్వహిస్తామన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తాయా అని మెట్రో వర్గాలు ఎదురుచూస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/