పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంస్థ!

exams
exams

హైదరాబాద్‌: తాజాగా ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌ చర్యలపై దృష్టి సారిస్తోంది.గతంలోనూకూడా ప్రశ్నా పత్రాల లీక్‌, ఇతరత్రా సమస్యలు ఉత్పన్నం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న విషయమై ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన తప్పిదాలు, అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం వివిధ బోర్డులు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయి. సాంకేతిక సహకారంతోపాటు ఇతరత్రా అవసరాల కోసం వివిధ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, ఫలితాలు సిద్ధం చేయడం, వివరాలు నమోదు చేయడం లాంటి ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి.ఇలా వేర్వేరు విధానాలు, వేర్వేరు సంస్థలు లేకుండా ఉంటే ఇబ్బందులు తలెత్తబోవన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం, అత్యున్నత స్థాయిలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. బోర్డులతో సంబంధం లేకుండా పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వివిధ పరీక్షలు నిర్వహించిన అనుభవజ్ఞులతో కూడిన సంస్థ ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారానే అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తే మేలు అన్న భావన ఉంది. ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందించాలని.. సాంకేతిక సహకారం కోసం ఐటీ విభాగాన్ని కూడా పటిష్ఠం చేయాలన్న ఆలోచన వ్యక్తమైనట్లు సమాచారం. ఇంటర్‌ ఫలితాలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలోనూ భవిష్యత్‌లో పరీక్షల నిర్వహణ కోసం కొన్ని సిఫార్సులు చేసింది. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరీక్షల నిర్వహణ కోసం పటిష్ఠ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/