తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

all-entrance-tests-postponed-telangana

హైదరాబాద్‌: కరోనా వ్యాపి నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జూలై 15 వరకు జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల వాయిదాపై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో జరగాల్సిన ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్టయింది. కాగా జులై 1న పాలిసెట్‌తో పాటు పీజీ ఈసెట్‌ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. జులై 4న ఈసెట్‌, జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్‌, 10 న లాసెట్‌, 13న ఐసెట్‌, 15న ఎడ్‌ సెట్‌ ప్రవేశ పరీక్షల నిర్వహణ జరగనుంది. కాగా కరోనా కేసులు పెరుగుతున్నందున ఎంట్రెన్స్‌ టెస్టులను రద్దు చేయాలని కోరుతూ స్టూడెంట్‌ యూనియన్‌ నేతలు హైకోర్టులో పిల్‌ వేశారు. పిల్‌పై విచారణ సందర్భంగా రాష్ట్రంలో జరగనున్న వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/