సిఎం కెసిఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలవుతాయని… లేకపోతే అన్నీ అటకెక్కినట్టే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ లెక్కలను ఆయన ప్రస్తావించారు. జనాభా ప్రకారం చూసుకుంటే… ఈ విషయంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కలెక్టర్ల సమావేశంలో 12 గంటల ఉపన్యాసం ఇచ్చిన సిఎం కెసిఆర్‌… కనీసం ఐదు నిమిషాలైనా రైతుల సమస్యలపై చర్చించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు సమన్వయ సమితిలు ఫెయిలయ్యాయని ధ్వజమెత్తారు. గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో 5,912 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటేనే… పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కెసిఆర్‌ ఎంతో గొప్పగా చెప్పే రైతు సమన్వయ సమితిలు టిఆర్‌ఎస్‌ నేతలకు పునరావాస కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా… బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/