యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలి

kcr
kcr

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండ్‌కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలన్నారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న స్టాకును రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించి, స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించే విషయంపై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా డిమాండ్‌పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించిందన్నారు.దీంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదని సిఎంకు వివరించారు. గత నాలుగు సంవత్సరాలలో ఖరీఫ్ సీజన్‌లలో 6 లక్షల టన్నులకు కాస్త అటూ ఇటూగా యూరియా అవసరముండగా, ఈ ఆగస్టు చివరి నాటికే రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరిందన్నారు. పైగా ఈసారి వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడడంతో పాటు, పంటల విస్తీర్ణం పెరగడంతో డిమాండ్ పెరిగిందన్నారు. రైతుల డిమాండ్ కు అనుగుణంగా వ్యవసాయ శాఖ జాగ్రత్త పడి వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ ఇచ్చిందని సిఎంకు అధికారులు వివరించారు. అయితే షిప్పుల ద్వారా యూరియా రాష్ట్రానికి రావడంలో ఆలస్యం జరిగిందన్నారు. ఈ కారణాల వల్ల యూరియాపై పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్రానికి తీసుకవచ్చి గ్రామాలకు యుద్దప్రాతిపదికన సరఫరా చేయాలని సిఎం ఆదేశించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/