హుజూర్‌నగర్‌లో కెసిఆర్‌ బహిరంగ సభ రద్దు

నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు

cm kcr
cm kcr

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌లో గురువారం టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ రద్దయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సభ వర్షం కారణంగా రద్దయ్యింది. గంటకుపైగా కుండపోత వర్షం కురవడంతో.. సభా ప్రాంగణం మొత్తం అస్తవ్యస్తమైంది. దీంతో సభను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సభ కోసం టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి.. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ముందు సత్తా చాటాలని భావించింది. ఈ సభను ట్రెండ్ సెట్టింగ్ సభగా టీఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు. కానీ గులాబీ నేతల ఆశలపై వర్షం నీరు చల్లింది.

కుండపోతగా కురిసిన వర్షం కారణంగా సభాప్రాంగణం బురదమయంగా మారింది. ఆకాశంలో మబ్బులు కమ్మేయడంతో మళ్లీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సభ రద్దు అవుతున్నట్టు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. కాగా వాతావరణం బాగోలేకపోవడంతో.. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ వెళ్లడానికి ఏవియేషన్ శాఖ అనుమతులు ఇవ్వలేదు. పైలెట్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/