చిత్రపురి సాధన సమితి సభ్యులతో జనసేనాని

pawan kalayan-Chitrapuri Sadhana Samiti members

హైదరాబాద్‌: హైదరాబాద్ లోని చిత్రపురిలో ఇళ్లు దక్కని కళాకారులకు తాను అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేవిధంగా ముందుకు వెళతామని చెప్పారు. ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు ఎన్.శంకర్, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజలతో తాను మాట్లాడుతానని అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చిన చిత్రపురి సాధన సమితి సభ్యులు.. తమ సమస్యలను పవన్ కల్యాణ్ కు వివరించారు. చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల్లో తాము పనిచేస్తున్నామనీ, కానీ చిత్రపురిలో ఇతరులకు ప్లాట్స్ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ విషయమై పోరాడినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినవారికి పని దొరక్కుండా చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న జనసేనాని.. చిత్రపురిలో తెలుగుసినిమా వారి ఇంటి కల నెరవేరాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ఇతరులతో మాట్లాడుతామనీ, జనసేన పార్టీ ఆర్టిస్టులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/