అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు

పల్లెప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి నిర్వహిస్తామన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పల్లెప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికలు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో 45 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. దీనికి రూ. 9,002 కోట్లు ఖర్చు అవుతందని, దీనిలో కేంద్రం వాటా కేవలం రూ. 200 కోట్లు మాత్రమేనని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌, బిజెపి పార్టీలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. పసుపు బోర్డు వాగ్దానంతో ఎంపిగా గెలిచిన ధర్మపురి అరవింద్‌ తన మాటను నిలబెట్టుకోలేకపోయారని ఆయన విమర్శించారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ, టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు నిరాశ చెందకుండా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/