పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారం

Woman raped in sangareddy
Woman raped in sangareddy

సంగారెడ్డి: దేశవ్యాప్తంగా ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు, ఆడవారిపై అత్యాచార ఘటనలు కొనసాగుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మార్పు రావడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం జరిగింది. పోలీసులమంటూ బస్సులో వెళ్తున్న ప్రయాణికురాలిని బెదిరించి, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనపై బాధితురాలు జహీరాబాద్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన 37 ఏళ్ల మహిళ తన కుమారుడు (12 ఏళ్లు)తో కలిసి ఇటీవల కర్నాటకలోని బీదర్‌కు వెళ్లింది. సోమవారం బీదర్ నుంచి తిరిగి సూర్యాపేటకు బయలుదేరింది. తల్లీకొడుకు బస్సులో ప్రయాణిస్తుండగా జహీరాబాద్ లోని పప్తాపూర్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సులోకి ఎక్కారు.

నేరుగా ఆ మహిళ వద్దకు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.. తాము పోలీసులమని చెప్పారు. లగేజీ బ్యాగ్‌లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయని, తనిఖీ చేయాలంటూ తల్లీకొడుకులను బస్సు నుంచి కిందకు దింపారు. ఇద్దరు వ్యక్తులు లగేజీని పరిశీలిస్తూ ఆమె కమారుడిని తమ వద్ద ఉంచుకున్నారు. మరో వ్యక్తి మాట్లాడాలంటూ ఆమెను రోడ్డుపక్కన ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ వెనకకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి ఆ మహిళపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి.. అక్కడి నుంచి ముగ్గురూ వెళ్లిపోయారు. ఘటనపై బాధితురాలు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/