సిటీ బస్సుల్లో వలస కూలీల తరలింపు

నేడు బీహర్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు ఆరు బస్సులు పయనం

hyderabad city bus
hyderabad city bus

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వేలాది మంది వలస కూలీలు నగరంలో చిక్కుకుపోయారు. కూలి కోసం పొట్ట చేత పట్టుకుని వచ్చి ఏదో ఒక పని చేస్తు ఉండే వారికి లాక్‌డౌన్‌ కారణంగా దొరికిన ఉఫాధిని కోల్పోయారు. అదీకాక రవాణా సౌకర్యాలు లేక వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడే ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లు నడుపుతుండడంతో కొంతమంది ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుని వారి సొంత ప్రాంతాలకు వెళ్లారు. ఇంకా వందలాది వలస కూలీలు నగరంలోని పోలీస్‌ స్టేషన్‌లలో తమ పేర్లను నమోదు చేసుకుంటుండడంతో, వారిని కూడా తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకే ప్రాంతానికి చెందిన వారు, వెయ్యి మందికన్నా ఎక్కువగా ఉంటే వారికోసం ప్రభుత్వం రైలు సదుపాయం కల్పిస్తుంది. అంతకంటే తక్కువ ఉన్న వారిని బస్సుల ద్వారా తరలించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం నగరంలోని 29 డిపోల్లో పూర్తి ఫిట్‌గా ఉన్న 600 బస్సులను సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు నియమించారు. టికెట్‌ భరించే శక్తి ఉన్న వారికి బస్సులను వెంటనే ఏర్పాటు చేస్తుండగా.. డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వమే ఉచితంగా తరలిస్తోంది. నేడు బీహర్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరు బస్సులు బయలు దేరాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/