విలువలు కాపాడుకుంటేనే విజయం సొంతం!

venkaiah naidu
venkaiah naidu

హైదరాబాద్‌ : కష్టపడే తత్వం, విలువలు కాపాడుకోవడం ద్వారానే విజయం సాధించగలమని ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు అన్నారు.గురువారం కోఠి మహిళా కళాశాలలో జరిగిన 14వ స్నాతకోవత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారి ఉండదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. వేదకాలం నుంచే భారత్‌లో మహిళల విద్యకు ప్రాముఖ్యత ఉందన్నారు. భారత్‌లో మొదటి నుండి గురుశిష్యులు పరంపర కొనసాగుతుందన్నారు. దేశంలో 65.46శాతం మహిళలు మాత్రమే అక్షరాస్యత సాధించారని ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఎంత ఎదిగినా తల్లిదండ్రులను,మాతృభాషను,మాతృదేశాన్ని ఎవరూ మరవకూడదని విద్యార్థులు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషకు ప్రాధాన్యత నిస్తున్నాయని అలాగే తెలుగులోనే పాలన జరగాలన్నారు.దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మహిళలు తమ వంతుగా కృషిచేయాలన్నారు. సమాజంలో ఉద్యోగాలకోసమే కాకుండా కొలువులు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు.తనకూతురు కూడా కోఠి ఉమెన్స్‌కాలేజీలోనే చదివిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తుచేశారు. మహిళలకు సమాన అవకాశం ఇవ్వకపోతే అభివృధ్ధి చెందలేమని వెంకయ్య తెలిపారు.అనంతరం ఉత్తమర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌ను అందజేశారు.ఈకార్యమ్రంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ఎస్‌.రామచంద్రం, ప్రొ.గోపాల్‌రెడ్డి ,ప్రొ.రోజారాణి, తదితరులు పాల్గొన్నారు.