విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ బదిలీ రద్దు చేయాలి

Education Commissioner
Education Commissioner

హైదరాబాద్‌: నిజాయితీపరుడు, అంకితభావంతో ఉద్యోగం నిర్వహించే విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ను బదిలీని రద్దు చేయాలని పలు ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ బదిలీని వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. గతంలో కిషన్‌ నిర్వహించిన వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, బిసి కమిషనర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌ ఎక్కడ అవినీతి మరకలు లేకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నీతి, నిజాయితీగా విధి నిర్వహణ చేశారని. అలాంటి కిషన్‌ బదిలీని 12 బిసి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నీతి, నిజాయితీ గల అధికారి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగని నిబద్దత గల అధికారిగా పేరుగాంచారని తెలిపారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు పని చేయడం లేదనే అక్కసుతో బదిలీ చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనీ, అంతేకాక ఇతర అధికారులు కూడా భయపడతారన్నారు. వెంటనే ఈ బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే బిసి సంఘాలు ఉద్యమిస్తాయని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, రాష్ట్ర బిసి ఫ్రంట్‌ ఛైర్మన్‌ గొరిగే మల్లేష్‌యాదవ్‌, నీల వెంకటేష్‌, టిఆర్‌.చందర్‌, జైపాల్‌ముదిరాజ్‌, మధుసూదన్‌, వెంకన్నగౌడ్‌, రమ్య, సి. రాజేందర్‌, కె. వీరన్న, బర్క కృష్ణయాదవ్‌లు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన చర్చలలో ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పి..దొడ్డిదారిలో వందల సంఖ్యలో టీచర్ల బదిలీలు అక్రమంగా చేయడం సమంజసం కాదని..ఈమేరకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.