వాతావరణ పరిస్థితులు ఇక అర చేతిలో

EATELA RAJENDER
EATELA RAJENDER

టీఎస్‌ వెదర్‌ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన మంత్రి ఈటల
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న వర్షపాతం, ఉష్ణోగ్రతలు, పీడనము, గాలి గమన దిశలు వంటి వాతావరణ వివరాలన్నీ ఇకపై క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నింటినీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ సరికొత్త మొబైల్‌ యాప్‌ను తయారు చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేషన్‌ సిస్టం కలిగిన ఏ మొబైల్‌లోనైనా టీఎస్‌ వెదర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఆ ప్రాంత ఎడబ్ల్యుఎస్‌ పంపిన వాతావరణ వివరాలు, అక్కడికి సమీపంలోని ఐదు ఎడబ్ల్యుఎస్‌లకు సంబంధించిన ప్రాంతాల వాతావరణ వివరాలు, రాష్ట్రంలో ఆరోజు నమోదైన వర్షపాతానికి చెందిన అత్యధఙక 10 ప్రాంతాలకు చెందిన వివరాలు, ప్రతీ జిల్లాలో ఆ రోజు నమోదైన వర్షపాతం, అత్యధిక ఐదు ప్రాంతాలకు చెందిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, వర్షపాతం, ఉష్ణోగ్రతలకు సంబంధించి రానున్న మూడు రోజులకు సంబంధించిన వివరాలు సైతం ముందుగానే తెలుసుకునే అవకాశం ఈ యాప్‌ ద్వారా కలిగింది. ఆదివారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ టీఎస్‌ వెదర్‌ మొబైల్‌ యాప్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఐసీ సహకారంతో తెలంగాణ ప్రణాళికాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ వివరాలు తెలుసుకునే యాప్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఇంత పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ వాతావరణ సమాచారం విషయంలో కచ్చితత్వం లోపిస్తోందన్నారు. సామాన్య ప్రజలు సైతం మొబైల్‌ యాప్‌ ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకునేందుకు ఈ యాప్‌ ద్వారా అవకాశం కలిగిందనీ, సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో యాప్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చనీ, గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి టీఎస్‌ వెదర్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి ఈటల వెల్లడించారు.