వర్సిటీని సందర్శించిన ప్రొబెషనరీ ఐఏఎస్‌లు

PJATAU
PJATAU

హైదరాబాద్‌: తెలంగాణ క్యాడర్‌కు కేటాయించిప బడిన 2017 బ్యాచ్‌ ప్రొబెషనరీ ఐఏఎస్‌ అధికారులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలనా భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌ సుధీర్‌కుమార్‌ విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులతోపాటు, బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను గూర్చి వివరించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనగా 13 వంగడాలను వివిధ పంటలలో విడుదల చేసినట్లు వారికి తెలిపారు. అంతేకాకుండా మూడు వ్యవసాయ కళాశాలలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. వరిలో విశ్వవిద్యాలయం విడుదల చేసిన తెలంగాణ సోన, కూనారం సన్నాలు వంటి రకాలు 40 శాతం సాగవుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది అదిలాబాద్‌లో కొత్తగా వ్యవసాయ కళాశాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన వృత్తి నిపుణులను అందించేందుకు విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని, అలాగే రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, వంగడాలను రూపొందింస్తున్నట్లు తెలియచేశారు. విశ్వవిద్యాలయంలో చేపడుతున్న పరిశోధనా కార్యక్రమాలను గూర్చి పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ జగదీశ్వర్‌ వివరించారు. వివిధ పంటల్లో నూతన వంగడాల రూపకల్పన, నాణ్యమైన విత్తనోత్పత్తి, పంటల జయాజమాన్యం, చీడపీడల నివారణఫ, సహజ వనరుల వినియోగం, ఎరువుల యాజమాన్యం వంటి పరిశోధనలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయ పరిధిలో మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, 15 పరిశోధనా స్థానాలు పనిచేస్తున్నాయని, స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు సాగిస్తున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సుల గురించి డీన్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ కెఎస్‌ డాంగి వివరించారు. విస్తరణ కార్యక్రమాలను గుర్చి విస్తరణ సంచాలకులు డాక్టర్‌ డి రాజిరెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖతో కలిసి వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన పరిశోధన ఫలితాలను రైతుల క్షేత్రాల్లో ప్రదర్శించే కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా విస్తరణ సేవలను రైతులు, వ్యవసాయ శాఖ అధికారులకు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 11 మంది ప్రొబెషనరీ ఐఏఎస్‌ అధికారులు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు డాక్టర్‌ కెవిఎస్‌ మీనాకుమారి, డాక్టర్‌ సదాశివరావు, డాక్టర్‌ విష్ణువర్థన్‌రెడ్డి, డాక్టర్‌ జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.