రైతు బీమా కోసం ప్రత్యేక యాప్‌

app
app

హైదరాబాద్‌: ఆగస్టు 15వ తేదీ నుండి రైతులకు అమలు చేయనున్న బీమా నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ను వినియోగించాలని నిర్ణయించింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐపి) తయారు చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారుల (ఎఇఒ) ట్యాబ్‌ల్లో ఇన్‌స్టాల్‌ చేశారు. నామినీ, బీమా దరఖాస్తుల నమూనా ఆధారంగా ఈ యాప్నఉ రూపొందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించింది. రైతులకు జీవిత బీమా పథకం అమలు చేసేందుకు ఈనెల 4వ తేదీన ఎల్‌ఐసి కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో వ్యవసాయ శాఖ ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 30 జిల్లాలకు బీమాతో పాటు నామినీ దరఖాస్తులను పంపామని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎఇఒ రైతుల నుండి వివరాలను సేకరిస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో సోమవారం నుండి ప్రారంభిస్తారని తెలిపాయి. దరఖాస్తులోని వివరాలను యాప్‌లో నమోదు చేసి ఆ సమాచారాన్ని ఎలఐసీకి పంపనున్నారు. ఇక క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. ఆధార్‌ కార్డు ఆధారంగా రైతుల వయస్సును నిర్ణయిస్తామని అధికారవర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఆధార్‌లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జూలై మొదటి తేదీని పుట్టిన రోజుగా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాప్‌లో రైతుల సమాచారంతో పాటు ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేయడం వల్ల రెండు మూడు ఖాతాలు ఉండవని అధికారవర్గాలు భావిస్తున్నాయి.