రేపు కలెక్టరేట్ల, ఆర్టీఓ ఆఫీసుల ముట్టడి

MUTTADI
MUTTADI

పంచాయతీరాజ్‌ బిసి రిజర్వేషన్లను 22% తగ్గించి ఎన్నికలు ప్రకటించడం అన్యాయం
సిఎం..ప్రధానితో రాజ్యాంగ సవరణపై ఒత్తిడి తేవాలి..
28న కుల సంఘాలు, బిసి సంఘాలతో సభలు-రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు పిలుపు-ఆర్‌.కృష్ణయ్య
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన గ్రామ పంచాయతీల్లో బిసి రిజర్వేన్లను 34% నుంచి 22%కు తగ్గించడం తీవ్రమైన అన్యాయమని..56% జనాభా గల బిసిలకు 22% రిజర్వేషన్లు ఇవ్వడం ఏ విధంగా న్యాయమని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌. కృష్ణయ్య ప్రశ్నించారు. మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో బిసిలకు 2345 ఇవ్వడం అన్యాయం, దుర్మార్గమన్నారు. దీన్ని బిసిలు క్షమించరని ఆయన హెచ్చరించారు. ఈ కేటాయించిన 22% రిజర్వేషన్లు లెక్కించడంలో కూడా 12751పై కాకుండా ఎస్టీ కోట తీసేసిన తర్వాత లెక్కించడం మరింత అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్య పూర్వకంగా బిసిలను రాజకీయంగా అణచివేసే దురుద్దేశ్యంతోనే తెగించి బిసిల గొంతు కోస్తున్నారని కృష్ణయ్య విమర్శించారు. ఒకవైపు జనాభా ప్రకారం బిసి రిజర్వేషన్లను 34% నుంచి 56%కు పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును సాకుగా చూపుతూ తగ్గించడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తగా వచ్చింది కాదని 2010లోనే ఈతీర్పు వచ్చిందన్నారు. ఈతీర్పు వచ్చిన తర్వాత 2013లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2014 ఎంపిటిసి, జెడ్పీటిసి, మున్సిపల్‌ ఎన్నికలు బిసిలకు 34% రిజర్వేషన్లు జరిపారని గుర్తు చేశారు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిసి రిజర్వేషన్లను 34% నుంచి 23%కు తగ్గించడానికి జీవో జారీ చేసిందన్నారు. వెంటనే బిసి సంఘాలు ఉద్యమాలు చేయగా అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి బిసి సంఘాలతో చర్చలు జరిపి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి, ప్రముఖులైన న్యాయవాదులున పెట్టి స్టే తీసుకొచ్చి 34% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపారని కృష్ణయ్య పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా 34% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, అప్పుడులేని అవరోధాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
బిసి రిజర్వేషన్లను 34% నుంచి 22%కు తగ్గించాలని సుప్రీంకోర్టు పదేపదే తీర్పులు ఇస్తున్నందున దీన్ని అధిగమించడానికి ఢిల్లీలో ఉన్న సిఎం కేసిఆర్‌..ప్రధాని నరేంద్రమోడీతో చర్చలు జరిపి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని కృష్ణయ్య కోరారు. ఎలాగు బుధవారం ప్రధానిని కలుస్తున్నారు కాబట్టి ఎంతో ప్రాధాన్యం గల ఈసమస్యను ప్రధానితో కేసిఆర్‌ చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా తగ్గించిన బిసి రిజర్వేషన్లను 34%కు పెంచి ఎన్నికలు జరుపాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్లను, ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసులు ముట్టడించి ధర్నాలు చేయాలని కృష్ణయ్య బిసిలకు పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 29న అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో కుల సంఘాలు, బిసి సంగాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. బిసిలకు తగ్గించిన రిజర్వేషన్లను పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.