మేము అధికారంలోకి వస్తే..పథకాలు..ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ!

Laxman
Laxman

హైదరాబాద్‌: కరీంనగర్‌ సభలో తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. కేటిఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె. లక్ష్మన్‌ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ గల్లీలో పులి..ఢిల్లీలో పిల్లి..అని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం కరీంనగర్‌లో బిజెపి ఏర్పాటు చేసిన సమరభేరీని అసమర్థ భేరీగా కేటిఆర్‌ అభివర్ణించడం..తదితర కామెంట్లపై లక్ష్మన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్‌ సభకు ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చారన్నారు. రెండుసార్లు అమిత్‌ షా తెలంగాణకు వస్తేనే..టిఆర్‌ఎస్‌ నేతలు బెంబేలెత్తిపోతున్నారని..ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  9 నెలల ముందు ఎన్నికలకు పోవడానికి గల కారణాలేంటో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పాలని లక్ష్మన్‌ డిమాండ్‌ చేశారు. జమిలి ఎన్నికలకు సరేనన్న కేసిఆర్‌ ఎందుకు మాట మార్చారని ఆయన నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మళ్లీ ఓటు అడుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యమకారులను మోసం చేసిన టిఆర్‌ఎస్‌ నేతలు బిజెపిని ప్రశ్నిస్తారా? అంటూ మండిపడ్డారు. ఆలయాల పరిరక్షణపై మాట్లాడే నైతికహక్కు టిఆర్‌ఎస్‌కు లేదన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం నుంచి నిధులు రాబబ్టుకున్న కేసిఆర్‌..ఏమీ ఇవ్వలేదనం హాస్యాస్పదంగా ఉందన్నారు. యూపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కొనసాగిన కేసిఆర్‌ ఎన్ని కోట్ల నిధులు తెలంగాణకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. హక్కుగా రావాల్సిన నిధులతో పాటు తెలంగాణకు అదనంగా మోడీ ప్రభుత్వం కేటాయించిందని లక్ష్మన్‌ పేర్కొన్నారు.   మోడీని ఎదుర్కొనే సత్తాలేక కాంగ్రెస్‌తో అంతర్గత ఒప్పందం పెట్టుకున్నారని లక్ష్మన్‌ ఆరోపించారు. ఓట్ల కోసం హిందువులను, ముస్లింలను మోసం చేసింది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తే టిఆర్‌ఎస్‌ పథకాలు, ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తామని లక్ష్మన్‌ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హైకోర్టు మెట్టికాయలు వేసిందని..ఓటమి భయంతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబతారని లక్ష్మన్‌ హెచ్చరించారు.