మెట్రో అధిక ఛార్జీలు త‌గ్గించాలిః కాంగ్రెస్‌ నేత‌లు

Metro
Metro

హైద‌రాబాద్ః హైద‌రాబాద్ వాసుల క‌ల‌ల బండి మెట్రోరైల్ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన విష‌యం తెలిసిందే. తొలిరోజు మెట్రోలో స‌ర‌దాగా ప్ర‌యాణించడానికి హైద‌రాబాదీయులు ఉత్సాహం చూపారు. అయితే, ప్ర‌తిరోజు త‌మ‌ కార్యాల‌యాల‌కు వెళ్లేవారు మెట్రోరైల్లో ప్ర‌యాణించ‌డానికి ఉత్సాహం చూపుతారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అందుకు కార‌ణం అధిక ఛార్జీలు ఉండ‌డ‌మే. తొలిరోజు మెట్రో ప్రయాణం బాగుందని ప్రయాణికులు మీడియాతో చెప్పారు. కానీ ధరల విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రోధ‌ర‌ల‌పై స్పందించిన‌ కాంగ్రెస్‌ పార్టీ ధరలను తగ్గించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తోంది.
భారీగా మోపుతోన్న‌ మెట్రో ధరలపై స్థానిక కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోతే ఆందోళనలు చేపడతామని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌ మెట్రోరైల్ ప్రారంభం ఇంత‌గా ఆలస్యం కావ‌డానికి టీఆర్‌ఎస్ స‌ర్కారే కారణమని అన్నారు. పెరిగిన వ్యయాన్ని కూడా స‌ర్కారే భరించాలని వ్యాఖ్యానించారు.