భారీ వర్షం ధాటికి సిటీ ట్రాఫిక్‌ వ్యవస్థ మటాష్‌

TRAFFIC JAM
TRAFFIC JAM

రోడ్లపై రెండు రోజులుగా భారీగా వరద నీరు….

పరిమిత సిబ్బందితో పరిస్థితులను చక్కదిద్దలేక పోతున్న బల్దియా
అత్తెసరు సిబ్బందితో ఏమీ చేయలేక పోయిన ట్రాఫిక్‌ విభాగం…

రహదారులపై గంటల తరబడి వాహనదారుల నరకయాతన
ఫ్లై ఓవర్లపైనా తప్పని ట్రాఫిక్‌ జాంలు…తూతూ మంత్రంగా అధికారుల సమీక్ష
హైదరాబాద్‌: జంట నగరాలలో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం ధాటికి ట్రాఫిక్‌ వ్యవస్థను ఒక్కసారిగా కుదేలయ్యింది. జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలలో గంటల తరబడి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమై నదులను తలపిస్తుండడంతో వాహనదారులు ఎక్కడి కక్కడ గంటల తరబడి ట్రాఫిక్‌ జాంలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. భారీ వర్షం కారణంగా నగరంతో పాటు శివార్లలోని అన్ని ఫ్లై ఓవర్లతో పాటు శ ంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే పి.వి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవేపైనా చాలా చోట్ల వరద నీరు నిలిచి పోవడంతో అక్కడ కూడా వాహనాలు సాఫీగా వెళ్లలేక పోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వాహనదారుల ఇక్కట్లను తొలగించేందుకు, ప్రజల అవస్థలను దూరం చేసేందుకు సర్కారు ఏర్పాటు చేసిన అన్ని అత్యవసర విభాగాలు అతీగతీ లేకుండా పోగా, సోమవారం రాత్రి వరకు కూడా ట్రాఫిక్‌ వ్యవస్థ కుదుట పడక పోవడం గమనార్హం. ఇక వర్షం వల్ల తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు బల్దియాతో పాటు, పోలీసు విభాగాలు చేబట్టిన చర్యలు వాహనదారుల ఇక్కట్లను తొలగించడంలో ఎంతమాత్రం ఉపకరించలేక పోయాయి.
నరకం అంటే ఇదేనేమో… నరకయాతన అంటే ఇదే కాబోలు… జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలలో ఆదివారం నుంచి వాహనదారులు పడుతున్న అష్టక ష్టాలకు నిజరూపం ఇది. చిన్నపాటి వర్షానికే సిటీ రహదారులన్నీ చెరువులను తలపించడం తెలిసిందే. ఇక భారీ వర్షం పడితే అంతే సంగతులన్నది విదితమే. నిన్నమొన్నటి వరకు ముంబాయి, చెన్నై, బెంగళూరు నగరాలలో కురిసిన భారీ వర్షాలకు ఆయా నగరాలలో ప్రజల అవస్థలను కళ్లారా చూసిన భాగ్యనగర వాసులకు ఈ కష్టాలు నిజంగా ఎలా వుంటాయనేది మరోసారి తెలిసి వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల జంట నగరాలతో పాటు శివార్లలో ఆదివారం ఉద యం నుంచి భారీ వర్షాలు కురవడం, ఇది సోమవారం రాత్రి వరకు కొనసాగడం తెలిసిందే. భారీ వర్షం వల్ల అనేక చోట్ల కాలనీలలో నీళ్లు చేరగా పల్లపు ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తి ఇళ్లను ముంచేశాయి. ఈ విషయం ఎలావున్నా భారీ వర్షం ధాటికీ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధుల్లో ట్రాఫిక్‌ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థంగా మారిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులైన అఫ్జల్‌గంజ్‌ నుంచి ఉస్మాన్‌గంజ్‌, మోజంజాహీ మార్కెట్‌, లక్‌డికాపూల్‌, ఖైరతాబాద్‌, పంజగుట్ట, సన త్‌నగర్‌ మార్గం, చార్మినార్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ కోఠి, ముషీరాబాద్‌ మీదుగా సికింద్రాబాద్‌ మార్గం, దిల్‌సుక్‌నగర్‌ నుంచి కోఠి మీదుగా మోజంజాహీ మార్కెట్‌, సనత్‌నగర్‌ మార్గం, సికింద్రాబాద్‌ నుంచి బాలానగర్‌ మీదుగా పటాన్‌చెరు వెళ్లే మార్గం, దిల్‌సుక్‌నగర్‌ నుంచి మూసారాంబాగ్‌, కోఠి మీదుగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లే మార్గం, అ త్తాపూర్‌ నుంచి మొహదీపట్నం, లక్‌డికాపూల్‌ మార్గ సోమవారం ఉదయం నుంచి ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. ఇదే సమయంలో వివిఐపిలు, ఐటి కంపెనీలు ఎక్కువగా వుండే మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌ ప్రాంతాలలోనూ వర్షం ధాటికి వరద నీరు రోడ్లను ముంచెత్తింది. దీంతో పాటు మొహదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి మార్గం సైతం పూర్తిగా జలమయమయ్యింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, ముంబాయికి వెళ్లే జాతీయ రహదారులు సై తం వరదనీటితో పోటెత్తాయి. జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా వర్షం కురవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఆదివారం నాడు వర్షం కురిసినా సెలవుదినం అవడంతో దీని ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే సోమవారం పనిదినం అవడంతో వర్షం ప్రభావం ఎ క్కువగా కనిపించి, దీని కారణంగా ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. వర్షం కారణంగా రహదారులపై ఏర్పడ్డ ట్రాఫిక్‌ జాంలో వాహనదారులు గంటల తరబడి ఇరుక్కు పోయారు. ప్రధాన రహదారులతో పాటు వాటికి అనుసంధానంగా వుండే సమాంతర మార్గాలలో కూడా వరదనీరు నదులను తలపించి ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను చవిచూశారు. గచ్చిబౌలి, షేక్‌పేట్‌, గుడిమల్కాపూర్‌, మొహదీపట్నం, అత్తాపూర్‌, డైరీఫాం, బెంగళూరు జాతీయ రహదారిపై గల మీర్‌ ఆలం చెరువు మార్గం, రామాంతపూర్‌, ఉప్పల్‌ రింగురోడ్డు, నాగోల్‌ తదితర మార్గాలలో వరద నీరు ఎక్కువగా వుండడంతో వాహనాలు రోడ్లపై వెళ్లేందుకు మొ రాయించాయి. ట్రాఫిక్‌ వ్యవస్థ కుదేలవడంతో కిలోమీటర్‌ దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది.
పనిచేయని అత్యవసర నంబర్లు…ఫోన్‌ తీసినా అదిగో…ఇదిగో అంటూ సమాచారం
ఫ్లై ఓవర్లపైనా తప్పని ట్రాఫిక్‌ జాంలు
చేతులెత్తేసిన బల్దియా…పోలీసు సిబ్బంది
ఇదిలావుండగా ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు వర్షం వల్ల ప్రజల అవస్థలను దూరం చేసేందుకు బల్దియా, వాటర్‌ వర్క్స్‌, కలెక్టరేట్‌, పోలీసు విభాగాలు ఏర్పాటు చేసిన అత్యవసర నంబర్లు నాంకేవాస్తేగా మారాయి. అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఈ నంబర్లకు ఫోన్‌ చేయండని నాలుగు విభాగాలు అదే పనిగా మీడియాలో ఊదరగొడుతున్నా వాస్తవంలో వచ్చేసరికి దీనికి విరుద్దంగా జరగడం గమనార్హం. బల్దియా అధికారిక అత్యవసర నంబర్‌ 21111111నే తీసుకుంటే ఈ నంబర్‌కు సోమవారం ఉదయం నుంచి వందల సంఖ్యలో ఫోన్‌లు వచ్చినా ఈ కాల్స్‌ను ఇక్కడి సిబ్బంది సరైన విధంగా రిసీవ్‌ చేసుకోలేదని విమర్శలు వచ్చాయి. చాలాసార్లు ఫోన్‌ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకునేనాథుడే కరువవగా ఇంకొన్నిసార్లు ఫోన్‌ను రిసీవ్‌ చేసుకున్నా అదిగో…ఇదిగో…అంటూ క్లుప్తంగా సమాచారం ఇచ్చి ఫోన్‌ కట్‌ చేశారని ఆయా ప్రాంతాల బాధితులు వాపోయారు. పోలీసు శాఖకు చెందిన 100, ట్రాఫిక్‌ విభాగం నంబర్‌ కూడా ఇలాగే వుందని ప్రజలు వాపోయారు. వాటర్‌ వర్క్స్‌, కలెక్టరేట్‌ విభాగాల నంబర్లు కూడా సరిగ్గా పనిచేయలేదని ఆయా ప్రాంతాల వారు ఆరోపించారు. ఈ విషయం ఇలావుంటే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలపైనా వరదనీరు నిలిచి పోవడంతో ట్రాఫిక్‌జాంలు తప్ప లేదు పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే పైనా వరద నీరు నిలిచి పోవడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఇదంతా ఒక ఎత్తయితే సోమవారం కురిసిన భారీ వర్షం వల్ల తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు బల్దియాతో పాటు పోలీసు విభాగం పూర్తిగా విఫలమయ్యిదని చెప్పాలి. సాధారణ సమయాలలో ట్రాఫిక్‌ గురించి అలా చేస్తాం…ఇలా చేస్తాం…వర్షాలు పడే సమయంలో సమన్వయంగా వ్యవహరిస్తాం అని పదే పదే చెప్పే బల్దియా, పోలీసు విభాగాలు సో మవారం నాడు హైదరాబాద్‌తో పాటు శివార్లలో తలెత్తిన ట్రాఫిక్‌ జాం గురించి ఏం చేశారనేది ఆ విభాగాల అధికారులకే తెలియాలి. ప్రజల కష్టాలు తీర్చేందుకు తా ము అది చేస్తున్నాం…ఇది చేస్తున్నాం…అని ఆయా విభాగాల అధికారులు నిత్యం మీడియాతో వెల్లడిస్తున్నా సోమవారం నాటి ట్రాఫిక్‌ జాంలను పరిశీలిస్తే క్షేత్రస్థాయి లో సర్కారీ విభాగాల పనితీరు అంతా డొల్లేనని మరోసారి తేటతెల్లమయ్యింది.