బండారు దత్తాత్రేయ తీవ్ర ఆక్షేపణ!

bandaruFFFF
bandaru

హైదరాబాద్‌ : అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థికసాయంతో నిర్మిస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కారిడార్‌-1లోని భాగమైన ఆమీర్‌పేట్‌-ఎల్‌బినగర్‌ రూట్‌లో మెట్రో సేవలను తెలంగాణ అపద్ధర్మ ప్రభుత్వం ఆదరా, బాదరాగా ఎన్నికల హడావుడిలో ప్రారంభించినట్లుగా ఉందని కేంద్ర మాజీమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్త్తాత్రేయ ఆరోపించారు. కనీసం కేంద్ర పట్టణాభిబివృద్ది శాఖమంత్రినైనా ఆహ్వానించకుండా ప్రారంభించడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ.1450కోట్లను వెచ్చిస్తుందని, అందులో ఇప్పటికే రూ.1200 కోట్లు విడుదల కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం ఫెడరల్‌ స్ఫూర్తిని పాటించకుండా, ప్రధానమంత్రి ఫోటోనైనా పెట్టకుండా సొమ్ము ఒకరిది..సోకు ఒకరిది అన్న చందంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓవైపు ప్రధానమంత్రి గారు టీంఇండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ అభివృద్దిలో ముందుకు తీసుకెళుతుంటే మరోవైపు మన కేసిఆర్‌ ప్రభుత్వం మాత్రం ఒంటెద్దుపోకడలతో నియంతృత్వ పాలన సాగిస్తుందని విమర్శించారు. మెట్రోరైల్‌లో టికెట్‌ ధరలు చుక్కల్ని తాకుతున్నాయన్నారు. కార్మికులకు, సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ల ధరల్ని స్థికరించాలని కోరుతున్నామని దత్తాత్రేయ పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టులో అతి ముఖ్యమైన కారిడార్‌-2 జూబిలీ బస్సుస్టేషన్‌ నుండి ఫలక్‌నుమాలో భాగంగా ఉన బోయిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, కోటి, ఎంజీబిఎస్‌లలో పనులు వేగంగా పూర్తి చేయాలని, హైదరాబాద్‌ పాత నగరంలో కూడా మెట్రో పనులను త్వరితగతిన చేపట్టాలని తాను డిమాండ్‌ చేస్తున్నానని దత్త్తాత్రేయ వెల్లడించారు.