ఫ‌లించ‌ని వేస‌వి విద్యుత్ వ్యూహాం

Electricity
Electricity

హైదరాబాద్‌: యాసంగి పంట చేతికి రావడంతో విద్యుత్‌ వినియోగం తగ్గిపోయి డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. యాసంగి పంటకు 24గంటల విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోగలిగింది. యాసంగికి ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయగలిగింది. వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరా ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. నూతన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ప్రారంభదశలో ఉండగా సింగరేణి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నుంచి వచ్చిన 1200మెగావాట్‌ల అదనపు విద్యుత్‌ ఉత్పత్తితో పాటు భారీగా కొనుగోళ్లు చేపట్టి విద్యుత్‌ సరఫరాను మెరుగు పరిచే ప్రయత్నం చేసింది. ఈ ఏదాది రికార్డు స్థాయిలో విద్యుత్‌ సరఫరా చేసింది. అత్యధికంగా మార్చిలో 10284మెగావాట్‌ల పిక్‌డిమాండ్‌ చేరుకుని రికార్డులు బద్దలు కొట్టింది. వరిసాగు ప్రారంభమైన జనవరి నెలలో అత్యధిక డిమాండ్‌ జనవరి 6న 9399మెగావాట్లుకు చేరింది. అది ఫిబ్రవరి నెలకు వచ్చే సరికి ఫిబ్రవరి 28న 10109మెగావాట్‌లకు చేరుకుంది. ఇలా ప్రతి నెల పెరుగుతూ వస్తోంది. మార్చి నెలలోనే ఎండలు ప్రారంభమవడంతో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం పెరగడంతో పాటు గృహ విద్యుత్‌ వినియోగం సైతం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో మార్చి 8న రాష్ట్రంలో అత్యధికంగా మునుపెన్నడూ లేని రికార్డు స్థాయి విద్యుత్‌ వినియోగం 10284 మెగావాట్‌లకు చేరి గరిష్ట మైలు రాయిని దాటింది. 2018లో తెలంగాణలో అత్యధిక విద్యుత్‌ సరఫరాతో రికార్డు సృష్టించింది. ఇది తెలంగాణ వచ్చాకనే కాదు గతంలో ఎన్నడూ లేని రికార్డులను తిరగ రాసింది. ఇక ఏప్రిల్‌ మాసం నుంచి క్రమంగా వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గుతూ వస్తోంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్‌ వినియోగం వేసవి కారణంగా ఎసిలు, కూలర్లు ఫ్యాన్‌ల వినియోగం పెరిగిపోయినా ఏప్రిల్‌ నెలలో 3వ తేదీన గరిష్టంగా 9132మెగావాట్లకు విద్యుత్‌ వినియోగం చేరుకుంది.
వ్యవసాయ విద్యుత్‌ వినియోగం చాలా వరకు తగ్గిపోవడంతో విద్యుత్‌ డిమాండ్‌ గణణీయంగా పడిపోయింది. మే 4వ తేదీన విద్యుత్‌ డిమాండ్‌ 6550మెగావాట్‌లకు పడిపోయింది. వేసవిలో ఉండే గృహ విద్యుత్‌ వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ జనవరితో పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా తప్పిందనే చెప్పాలి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్‌ సరఫరాలో గణనీయమైన మార్పులు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్‌ వినియోగం గరిష్ట డిమాండ్‌ 6666మెగావాట్‌లు ఉండేది. అది కాస్తా ఈ ఏడాది పీక్‌ డిమాండ్‌ 10284మెగావాట్‌లతో పోలిస్తే దాదాపు 60శాతం అధికంగా ఉంది. విద్యుత్‌ సరఫరాకు మౌళిక సదుపాయాలు కల్పించడం ఈ ఏడాది ప్రారంభం నుంచి వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు 24గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు వేసవిలో విద్యుత్‌ వినియోగం టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో 101మిలియన్‌ యూనిట్లు ఉంటే అది 2018కి వచ్చే సరికి 150మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఎన్‌పిడిసిఎల్‌ పరిధిలో 2014కు మందు వేసవిలో గరిష్ట విద్యుత్‌ వినియోగం 44మిలియన్‌ యూనిట్లు ఉండేది. ఈఏడిది ఎన్‌పిడిసిఎల్‌ పరిధిలోని విద్యుత్‌ వినియోగం 70మిలియన్‌ యూనిట్లు దాటింది.అయితే యాసంగి పంట చేతికి రావడంతో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ వినియోగం పడిపోయింది. దీంతో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో 95మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతోంది. అదే విధంగా ఎన్‌పిడిసిఎల్‌ పరిధిలో 25మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 9గంటల విద్యుత్‌ సరఫరా నుంచి 24గంటల సరఫరాను 2018 జనవరి 1 నుంచి ప్రారంభించింది. అయితే ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల సరఫరా చేయగలుగుతుందా లేదా అనే అనునమానం ఉండేది. ప్రతి ఏటా వేసవిలో విద్యుత్‌ సరఫరా లేక ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు 24గంటల వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేయగలిగారు. ఏదేమైనా విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పితే అయితే ఐదు నెలలుగా విద్యుత్‌సరఫరాలో ఏలాంటి ఇబ్బంది రాకుండా చేయడంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు సఫలమైయ్యాయని చెప్పవచ్చు.
మే నెల ప్రారంభం నుంచి విద్యుత్‌ పీక్‌ డిమాండ్‌ వివరాలు
మే 1న -6869 మెగావాట్లు
మే 2న -7428 మెగావాట్లు
మే 3న -7034 మెగావాట్లు
మే 4న -6550 మెగావాట్లు