ప్లాస్టిక్‌ నిషేదం అమలయ్యేనా?

Plastic
Plastic

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేదాన్ని అమలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. నిషేదిత ప్లాస్టిక్‌ను వినియోగించే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన స్థానిక సంస్థలు పట్టించుకోవడం లేదు. దీంతో విచ్చల విడిగా నిషేదిత ప్లాస్టిక్‌ బహిరంగ మార్కెట్‌లో కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. సంవత్సరానికి హైదరాబాద్‌ మహానగరంలోనే 73కోట్ల ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం జరుగుతుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలిసిపోతుంది. హైదరాబాద్‌ నగరంలో 20లక్షలకు పైగా గృహాలు ఉన్నాయి. వీటిలో నివాసం ఉంటున్న 50లక్షల కుటుంబాలు కనీసం 20లక్షల మంది ప్రతి రోజు కూరగాయాలు, నిత్యావసర వస్తువులు, కొనుగోలు దుకాణాలకు వెళ్తుంటారు. వీరిలో ఒక్కోక్కరు ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో కూరగాయలు, నిత్యావసర వస్తువులకు వినియోగించడం ద్వారా వారానికి 1.40లక్షల కోట్ల కవర్లు, సంవత్సరానికి 73కోట్ల కవర్లు పంపిణీ అవుతున్నాయి. ఈ కవర్లలో అధిక శాతం 50శాతం కంటే తక్కువ పరిమాణంలో ఉన్న కవర్లు ఉంటున్నాయి. ఈ కవర్లలో ఒక్క కవర్‌ నాలాలో పడితే అది మురుగునీటి ప్రవాహానాకి అడ్డంపడి మ్యాన్‌హోల్‌ జామ్‌ అవుతూ రహదారిపై మురునీటి ప్రవాహానికి కారణం అవుతుంది. ప్రధానంగా మటన్‌, చికెన్‌ షాపులు, కర్రీ పాయింట్‌లలో 50మైక్రాన్ల లోపు కవర్ల వినియోగం అధికంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల కవర్లను వినియోగిస్తున్నారో తెలిసిపోతుంది.
ప్లాస్టిక్‌ నిషేదం అమలు చేయాల్సిన విషయంలో స్థానిక సంస్థలు కఠినంగా ఉండాల్సి ఉంది. కానీ అలా ఉండటం లేదు. పర్యావరణ దినోత్సవాలు, ఇతర కార్యక్రమాలు, మంత్రి ఆదేశించినప్పుడో, ఏదైనా సమీక్షలు నిర్వహించినప్పుడో హడావుడిగా ఓ నాలుగు రోజులు తనిఖీలు చేయడం జరిమానాలు విధించడం అలవాటుగా మారిపోయింది. ఆ తరువాత ఈ విషయాన్ని పట్టించుకునే వారు కనిపించడం లేదు. ఇప్పటికే ప్లాస్టిక్‌ నిషేదించాలంటూ స్థానిక సంస్థలకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శికి లేఖ రాసారు. కానీ స్పందన మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ప్లాస్టిక్‌ నిషేదంపై వివిధ రాష్ట్రాలలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్ల నిషేదం విధించిన మహారాష్ట్ర సర్కారు నిషేదాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాతో మూడు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి ఈ నిషేదం అమలులోకి వచ్చింది. నిషేదాన్ని అములు చేసేందుకు 249 మంది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బస్టాండులు, రైల్వేస్టేషన్‌లు, బీచ్‌లలో ప్లాస్టిక్‌ కవర్లను మొదటి సారి దొరికితే రూ.5000లు, రెండోసారి దొరికితే రూ.10000, మూడోసారి రూ.25000తో పాటు మూడు నెలల జైల శిక్ష విధించనున్నారు. కానీ మన రాష్ట్రంలో కఠిన శిక్షలు లేకపోవడంతో విచ్చల విడిగా ప్లాస్టిక వినియోగం జరుగుతుంది.
భావి తరాలకు మేలు చేయండి: టాలివుడ్‌ హీరోయిన్‌ ఈషా మంత్రి కెటిఆర్‌కు ట్వీట్‌
సోషల్‌ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌, తాజాగా టాలివుడ్‌ హిరోయిన్‌ ఈషా ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. భారత్‌లో ఎన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్‌ నిషేదించాయి. మన రాష్ట్రం చాలా వాటిలో నెంబర్‌.1 ఉంది. కానీ మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా ఎందుకు మార్చడం లేదు. పలు రంగాల్లో అగ్రగామిగా ఉన్నాం. ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా లేకపోవడం బాధ కలిగిస్తుందని, దీని గురించి ఆలోచించాలంటూ ట్వీట్‌ చేసింది. ప్లాస్టిక్‌ నిషేదంపై దృష్టి సారించి భావి తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలంటూ పేర్కొంది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేవలం చట్టాలు చేయడం వల్ల ప్లాస్టిక్‌ను నియంత్రించలేము. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలు అధికారులు, తయారీదారులపై, వినియోగదారులకు అర్థమైనప్పుడే నియంత్రించగలమని, ప్రస్తుతం దీనిపై అవగాహాన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ బదులిచ్చారు. దీనిపై ఈషా దన్యవాదాలు తెలిపింది. నేను ఈ విషయంలో మీతో ఏకీభవించను. మీలాంటి సమర్థవంతుడైన యువనాయకుడు ఉంటే ఏదైనా సాధించగలం. మీరు తలుచుకుంటూ రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రాల్లో నెంబర్‌.1గా మార్చగలరు అంటూ ఈషారెబ్బ ట్వీట్‌ చేశారు.
జూన్‌ 13వ తేదిన పురపాలక శాఖ కార్యదర్శి కమిషనర్‌లకు జారీ చేసిన ఆదేశాలు
స్థానిక సంస్థలలో ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేయాలని, దీనికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుందని అన్న విషయాలపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ నిషేదం ఏవిధంగా అమలు చేస్తే విజయవంతం అవుతుంది అన్న దానిపై సమగ్రంగా ప్రణాళికచేసుకోవాలన్నారు. కార్యాలయాల్లో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను ఉపయోగిస్తున్నారని, వీటిని ఉపయోగించవద్దని, కనీసం 10-200 బాటిళ్లను ఉపయోగిస్తున్నారని, వీటిని ఉపయోగించవద్దన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి వాడిపడవేసే ప్లాస్టిక్‌ వినియోగించవద్దని సూచించారు. ప్రధానంగా 50మైక్రాన్ల కంటే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను నిషేదించారు. సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ నిబంధనలు పాటించాలన్నారు. దీనికి సంబంధించి ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విషయాలను మున్సిపల్‌ కమిషనర్‌ వాట్సప్‌లో ఉంచాలన్నారు. ఒకసారి తాగి పారవేసే ప్లాస్టిక్‌, ట్రెట్రా బాటిళ్లు, ఒకసారి ఉపయోగించే స్ట్రాలు, ప్లాస్టిక్‌/స్టేయోఫాం టీ కప్స్‌/కంటోనర్స్‌, 50మైక్రాన్ల కంటే తకువంగా ఉపయోగించే ప్లాస్టిక్‌/ ప్లాస్టిక్‌ కోటెడ్‌ వస్తువులు, నిషేదం వినియోగించే ప్లాస్టిక్‌లను ఉపయోగించవద్దని సూచించారు.
నాలాల్లో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు
ప్లాస్టిక్‌ వ్యర్థాలు నాలాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుని, నిర్లక్ష్యంగా నాలాల్లోకి వేసే వారిపై మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనికి సంబంధించి గత కొంత కాలం క్రితం హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ సర్వే నిర్వహించినప్పుడు 40శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నట్లు తేల్చింది. ఉదాహరణకు సెంట్రల్‌జోన్‌ పరిధిలో షేక్‌పేటలోని విరాట్‌ నగర్‌లో షేక్‌పేట నాలా పూడిక పనులను పైలెట్‌ పద్దతిలో అధ్యయనం చేయగా, నాలాల్లో 40శాతం వ్యర్థాలు ప్లాస్టిక్‌ ఆధారిత వ్యర్థాలు ఉన్నాయని స్పష్టమైంది. విరాట్‌నగర్‌ నాలాలో చేపట్టిన పూడికతీత పనుల్లో వచ్చిన ఒక క్వింటాల్‌ వ్యర్థాలను తీసుకుని పరిక్షించగా దీనిలో 40శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు అంటే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు, ప్లాస్టిక్‌ కవర్లు, పేపర్‌ ప్లేట్లు, చెక్క కలప పదార్థాలు ఉన్నాయని స్పష్టమైంది. ఈ క్వింటాల్‌ వ్యర్థంతో నీటి పరిమాణం 20శాతం, పూడిక మన్ను 40శాతం తేలియాడే పదార్థాలు, 40శాతం ఉన్నట్లు తేలింది. వీటిలో 20 శాతం వ్యర్థ జలాలు, 40శాతం మట్టి తిరిగి మిగిలిన 40శాతం తేలియాడే వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు కాగా వీటితో పాటు గుర్రపు డెక్క, చిన్నచిన్న కలుపు మొక్కలు పొదళ్లు, కర్ర సంబంధిత వ్యర్థాలున్నాయి. రెండవ పొరకు చెందిన మరొ టన్ను వ్యర్థాలను పరిశీలించగా దీనిలో 70శాతం పూడిక పన్ను, 10శాతం గట్టి పదార్థాలు, 20శాతం మురుగునీరు ఉన్నట్లు తేలింది. పూడిక మన్ను మురుగు నీటిని తీసివేస్తే 20 శాతం ఘన వ్యర్థాలతో పారేసిన కొబ్బరి బొండాలు, గాజు పదార్థాలు, రాళ్లు, కంకరతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలున్నటు స్పష్టమైంది. ఇలా చెప్పుకుంటూ ప్లాస్టిక్‌ అన్ని విధాలుగా అనర్థాలను కలిగిస్తుంది. ఇలాంటప్పుడు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన స్థానిక సంస్థలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్లాస్టిక్‌ నిషేదం అమలు కావడం లేదు. ఇప్పటికైనా భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణలో కీలకంగా ఉన్న ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.