పౌరసరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం

EATELA RAJENDER
EATELA RAJENDER

80శాతం ప్రక్షాళన జరిగింది
హమాలీలతో నేడు భేటి…సమస్యను పరిష్కరిస్తాం
రేషన్‌ డీలర్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది
మంత్రి ఈటల రాజేందర్‌
హైదరాబాద్‌: రేషన్‌ డీలర్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, చేతినిండా పనిచేయించాలి, కడుపు నిండా అన్నం పెట్టాలనే విధానం మాది అని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. డీలర్లకు సరఫరా చేసే బియ్యంలో బరువు తగ్గకుండా చూడాలని దాని కోసం ప్రతి గోదాముల వద్ద వేయింగ్‌ మిషన్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. బుధవరాం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 80శాతం ప్రక్షాళన పూర్తయిందని, ఇంకా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. హమాలీలలో గురువారం భేటి అవుతామని, వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖకు సొంతగా ఉన్న 52 గోదాముల వద్ద పెద్ద మిషన్లు శాశ్వతంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ పాస్‌ మిషన్లు వచ్చిన తరువాత బియ్యం అక్రమరవాణాను అరికట్టగలిగామని, ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సానుకూలంగా ఉన్న సమయంలో మరోదఫా డీలర్లతో చర్చలు జరపాలని కమిషనర్‌ని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఒక అధికారిక బృందం ఢిల్లీకి వెళ్లాలని సూచించారు. తమిళనాడుకు బియ్యం సరఫరా చేస్తున్నామని, అలాగే భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి బియ్యం సరఫరా చేయడానికి పక్కా విధి విధానాలను తయారు చేయాలని ఆదేశించారు. కడిగిన ముత్యంలా ఉండాలనేది తనలక్ష్యం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. పాతాలంలో ఉన్న ఈ శాకను పైకి తీసుకుని వచ్చామని, దీనిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ ఒరబడిని కొనసాగించాలని కోరారు. పేదరికం తగ్గాలి, ఆకలితో ఉన్న వారు లేకుండా చూడాలనేది ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ అకున్‌ సభర్వాల్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.