పాఠ‌శాల‌లో ఉరి వేసుకున్న ఉపాధ్యాయుడు

Hang Suicide Judge
Hang suicide Teacher

కరీంనగర్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోగా విషయం నేడు ఉదయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన మధుసూదన్ రెడ్డి.. కరీంనగర్ రూరల్ మండలంలోని గుంటూరుపల్లి ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్కూల్ ముగిసినా టీచర్ అందరితో పాటు ఇంటికి వెళ్లలేదు. పొద్దుపోయేదాక పాఠశాలలోనే ఉండి తరగతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధుసూదన్‌రెడ్డి ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన కు టుంబీకులు ఆచూకీ కోసం వెతకసాగారు. పాఠశాలకు వెళ్లి చూడగా బైక్ బయటనే ఉండటంతో స్కూల్‌లో వెతికారు. ఓ తరగతి గదిలో ఉపాధ్యాయుడు విగతజీవిగా కనిపించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుల్లో ఒకరికి మతిస్థిమితం సరిగా లేదు. ఇతడి గురించి తీవ్రంగా కలతచెందిన మధుసూదన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన భార్య పేర్కొంది. జీవిత సమస్యలను భరించలేకపోతున్నట్లు.. తన కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఉపాధ్యాయుడు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేమాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనుండగా ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.