పదిహేను రోజులకోసారి సీఎల్పీ సమావేశం

Bhatti
Bhatti

సాగునీటి ప్రాజెక్టులకు రూ.రెండు లక్షల కోట్లా
సీఎల్పీ నేత భట్టి
హైదరాబాద్‌: ఇక నుంచి ప్రతీ 15 రోజులకు ఒకసారి సీఎల్పీ సమావేశం నిర్వహిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. పంచాయతీ ఎన్నికల తరువాత సీఎల్పీ కమిటీలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఆదివారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ సీఎల్పీ నేతగా ఎంపిక చేసిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నామనీ, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు. తనను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినందుకు హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పారు. పీసీసీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం కేసీఆర్‌ చెబుతున్నారనీ, అయినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై రూ. రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఈ ఖర్చు ద్వారా పారే నీళ్లలో కనబడాలని కానీ, అలా ఎక్కడా లేదని చెప్పారు. ఈ నిధులపై అర్ధవంతమైన చర్చ జరగాలన్నారు. దీనిపై సీఎం సమాధానం చెప్పాలనీ, లేనిపక్షంలో సాంకేతిక నిపుణులతో కలసి ప్రాజెక్టుల బాట పడతామని చెప్పారు. ప్రభుత్వంపై నిర్మాణాత్మకంగా పోరాడతామనీ, రెండేళ్లుగా ప్రజా సమస్యలపై అసలు చర్చ జరగలేదన్నారు. సీఎం ప్రాజెక్టులను నేనే డిజైన్‌ చేస్తా అంటున్నారనీ, ఆయనకు టెక్నికల్‌ గురించి తెలుసా లేదా అని ప్రశ్నించారు. దీనిపై ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ వేయాలనీ, అర్ధ వంతంగా నిధులు ఖర్చు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలనైనా ఎక్కువ రోజులు జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ ఏడాది రెవెన్యూ సదస్సులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయాలేదనీ, భూ ప్రక్షాళన పేరు మీద ఉమ్మడి రాష్ట్ర పాస్‌బుక్‌లను తొలగించి కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చారని విమర్శించారు. భూ ప్రక్షాళన పేరు మీద ఎలాంటి ప్రక్షాళన జరగలేదనీ, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయనీ, భూ ప్రక్షాళన పేరుతో రైతులపై కొత్త సమస్యలు పడ్డాయని ఆరోపించారు.