పక్కదారిన సబ్సిడీ విత్తనాలు

Farmer
Farmer

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజనులో సబ్సిడీ విత్తనాలు యదేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. రైతులకు లబ్ది చేకూరాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పటిష్టంగా చేపట్టిన విత్తనాల పంపిణీ అక్రమార్జనపరుల జజేబులు నింపుతోంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ తదితర జిల్లాల్లో సబ్సిడీ విత్తనాలను కొందరు స్వాహా చేస్తున్నారు. ఈవిధంగానే నిర్మల్‌ జిల్లాలోని తనూర్‌, కుబీర్‌, ముధోల్‌ మడలాల పరిధిలో మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 100కు పైగా సబ్సిడీ సోయా విత్తనాల బస్తాలు పట్టుబడ్డాయి. వీటిని ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమాల వెనుక కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అక్రమాలు జరుగకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినా అడ్డదారిలో యదేచ్ఛగా వాటిని మళ్లిస్తున్నారు. వానాకాలం సీజనులో రాయితీ విత్తనాలు పొందేందుకు వీలుగా క్లస్టర్‌ స్థాయిలో కూపన్లు పొందేలా చర్యలు తీసుకున్నారు. రాయితీ విత్తనాలు అవసరమైన రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు జీరాక్స్‌ కాపీని తీసుకెళ్లాల్సి ఉంది. వాటిఇనపరిశీలించిన ఏఈఒ పట్టాదారు పాస్‌ పుస్తకం ఖాతా సంఖ్య నమోదు చేసుకుంటారు. ఆ రైతుకు సంబంధించిన భూమి వివరాలు, సర్వే నెంబర్‌, గత ఏడాది వేసిన పంట తదితర వివరాలు వెల్లడవుతాయి. రైతుకు ఉన్న భూమికి తగినట్లుగా అవసరమైన విత్తన సంచులను అందులో నమోదు చేయడంతో కూపన్‌ సంఖ్య కేటాయించబడుతుంది. ఆ సంఖ్యను విత్తన కేంద్రంలో చూపించి రాయితీ పోను మిగిలిన సొమ్మును చెల్లిస్తే విత్తనాలు ఇస్తారు. ఇది కూడా ఏరోజు కూపను తీసుకుంటారో అదే రోజు రైతులు విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజు వెళితే ఇవ్వడానికి కుదరదు. మళ్లీ విత్తనాలు పొందాలంటే తిరిగి కూపన్లు పొందాల్సిఉంటుంది. ఏ రోజు ఎంత మంది విత్తనాలు పొందారు, ఇంకా ఎంత నిల్వ ఉందనే వివరాలు ఎప్పటికప్పుడు అధికారులు తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇంత పగడ్బందీగా విత్తనాల సరఫరాను నిర్వహిస్తున్నా వాటిలో కూడా అక్రమార్జనపరులు అడ్డదారులు వెదుకుతున్నారు. కొందరు దళారులు రంగప్రవేశం చేసి సాగు చేయని భూస్వాములు, పెద్ద రైతులు వద్ద పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులకాపీలను సేకరించి వాటితో సబ్సిడీ విత్తనాలను పొందుతున్నారు. కౌలుకు ఇస్తున్న పెద్ద రైతులు, బంజరు భూములను చూపించి సబ్సిడీ విత్తనాలను కైంకర్యం చేస్తున్నట్ల సమాచారం. దీంతోపాటు, ఏదో ఒక సర్వే నెంబర్లు, ఆధార్‌ నెంబర్లు నమోదు ఇందులో సంబంధిత అధికారులు దళారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది, అధికారుల సహకారం లేకుండా విత్తనాలను పక్కదారి పట్టించడం సాధ్యం కాదనే అభిప్రాయం రైతాంగంలో నెలకొంది. వీటిని ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక తదితర రాష్ట్రాలకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలియవచ్చింది.
కాగా తెలంగాణలో వానాకాలం సీజను ప్రారంభం కావడంతో ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు అందుబాటులో ఉండే విధంగా అన్ని జిల్లాలకు చేరవేసింది. వానాకాలం సీజనుకు 7 లక్షల 50 వేల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వేరుశనగ, సోయాబీన్‌, వరి, రాగులు, కందులు, పెసలు, మినుములు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జ, ఆముదం, పొద్దుతిరుగుడు, పిల్లిపెసర వంటి విత్తనాలు రైతులకు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 6 లక్షల 45 వేలు, హాకా ద్వారా 65 వేలు, ఆయిల్‌ఫెడ్‌ ద్వారా 10 వేలు, మార్కెఫెడ్‌ ద్వారా 10 వేలు, ఎన్‌ఎస్‌సి ద్వారా 20 వేల క్వింటాళ్ళ విత్తనాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏయే జిల్లాల్లో ఎన్ని క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉంటుందనే సమాచారాన్ని ముందుగానే తెప్పించుకున్న వ్యవసాయ శాఖ ఆమేరకు ఏర్పాట్లు చేసింది. గత వ్యవసాయ సీజనులో అంటే 2017-18లో వానాకాలం, యాసంగి సీజన్లకు 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయగా, ప్రస్తుత 2018-19 సీజనులో దానికి అదనంగా మరో రెండు లక్షల క్వింటాళ్లు మొత్తం 12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సరఫరా చేస్తోంది. ఈ విత్తనాలను 33 నుండి 50 శాతం వరకూ సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే విత్తనాల్లో వరికి సంబంధించి వానాకాలానికి 2 లక్షల 5 వేల క్వింటాళ్లను రైతులకు పంపిణీ చేస్తోంది. అలాగే సోయాబీన్‌ రెండు లక్షల క్వింటాళ్లు, వేరుశనగ లక్ష 20 వేల క్వింటాళ్లు, శనగ 1 లక్ష 3 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 90 వేల క్వింటాళ్లు, కంది 20 వేల క్వింటాళ్లు, పెసర 14 వేల క్వింటాళ్లు, మినుములు 11 వేల క్వింటాళ్ల చొప్పున రైతాంగానికి సరఫరా చేసేందుకు అన్ని జిల్లాలకు విత్తనాలను పంపించారు. ప్రధానంగా పత్తి విషయంలో ఈ వానాకాలం సీజనులో అధికంగా సాగు అవుతుందని అంచనా. గత ఏడాది 20 లక్షల 69 వేల 847 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, అందులో 17 లక్షల 36 వేల 450 హెక్టార్ల విస్తీర్ణంలో రైతుల సాగు చేశారు. పత్తి విత్తనాల విషయానికి వస్తే సుమారు 43 విత్తన కంపెనీల ద్వారా 79 లక్షల 15 వేల 508 పత్తి విత్తనం ప్యాకెట్లు అమ్ముడుబోయాయి. ఈ సీజనులో 1 కోటి 22 లక్షల 30 వేల 722 ప్యాకెట్లు వినియోగం అవుతుందని అంచాన వేసింది. ఇక వానాకాలం వివిధ పంటల సీజనుకు సంబంధించి రాయితీపై విక్రయించే వివిధ విత్తనాల ధరలను వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రధానంగా సోయాచిక్కుడు, జీలుగ, జనుము, పిల్లపెసర విత్తనాల ధరల ధరలను పెంచింది. 2017తో పోలీస్తే విత్తనాల ధరలు బహిరంగ మార్కెట్లో పెరిగాయి. పెరిగిన విత్తనాల ధరలు రైతులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో రాయితీలు చెల్లించేందుకు వ్యవసాయ శాఖ ముందుకు వచ్చింది. 2017లో జనుము, పిల్లిపెసర, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలపై 50 శాతం రాయితీ ఉండగా, దాన్ని ఈ ఏడాది 65 శాతానికి పెంచారు. అలాగే సోయాబీన్‌ విత్తనాలపై గత ఏడాది 33.33 శాతం ఇస్తుండగా, దాన్ని ఇప్పుడు 37 శాతానికి రాయితీని పెంచారు. జీలుగ, జనుము, పిల్లపెసర విత్తనాలను ఉత్తరప్రదేశ్‌ నుండి, సోయాబీన్‌ విత్తనాలను మధ్యప్రదేశ్‌, మహారా్ట నుంచి వ్యవసాయ శాఖ కొనుగోలు చేస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో పోయిన సంవత్సరం ఈ పంటలు దెబ్బతినడంతో విత్తనం కొరత ఏర్పడింది. దీంతో వీటి ధరలు కొంతమేర పెరిగాయి. కాగా జీలుగ క్వింటాల్‌ ధర 2017లో 4,100 రూపాయలు కాగా, ఈ ఏడాది 7,100 రూపాయలుగా వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. దీంతో రైతులకు ఇస్తున్న 2,500 రూపాయల రాయితీని 4,615 రూపాయలకు పెంచి, రైతు చెల్లించే ధరను 2,485 రూపాయలుగా నిర్ణయించారు. పిల్లిపెసర ధర గత ఏడాది 11,900 రూపాయలు ఉండగా, ఈ ఏడాది 13,500 రూపాయలకు పెరగడంతో రాయితీని 8,775 రూపాయలకు పెంచారు. రైతు చెల్లించాల్సిన ధర 4,725 రూపాయలుగా నిర్ణయించారు. సోయాబీన్‌ విత్తనాలధర 5,475 రూపాయలు నుండి 5,800 రూపాయలకు పెరగడంతో రాయితీని 2,146 రూపాయలకు పెంపుదల చేసి రైతులు చెల్లించాల్సిన ధరను 3,654 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే జనుము విత్తనాల ధర 5,700 రూపాయల నుండి 8 వేల రూపాయలకు పెరగడంతో రాఇయతీని 5,200 రూపాయలుగా ప్రకటించింది. ఇందుకుగాను రైతు 2,800 రూపాయలు చెల్లించాల్సిఉంటుంది. దీంతో అక్రమార్జనపరుల దృష్టి వీటిపై పడింది. కొందరు అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ విత్తనాలను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.