నేరెళ్ల ఘ‌ట‌న బాధ్యుల‌పై చ‌ర్య‌లు: కోదండ‌రామ్‌

KODANDA RAM1
KODANDA RAM

హైదరాబాద్: నేరేళ్ల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వామపక్షాలు, తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసింది. మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన సమావేశంలో నేరెళ్ల బాధితుల కష్టాలను హోమంత్రికి వివరించారు. నేరేళ్ల ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకున్న వారిపై పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని, పోలీసులు దళితులను కులం పేరుతో దూషించారని తెలిపారు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న యువకులను పోలీసులు విచక్షణారహితంగా హింసించారని హోం మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా  సీపీఐ, తెలంగాణ ఐకాస, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో హోంమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి ఫిర్యాదు చేసినా నేరెళ్ల బాధితులకు న్యాయం జరుగలేదని, ఎస్పీపై ఇప్పటికి చర్యలు తీసుకోలేదన్నారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రతినిధులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న హోంమంత్రి  సానుకూలంగా స్పందించినట్లు కోదండరాం చెప్పారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి, దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.