నేను ప్ర‌జాసేవ‌కుణ్నిః ఎంపీ కొండా

Konda vishweshwar reddy
Konda vishweshwar reddy

వికారాబాద్ : పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా ప్రజలకు సేవ చేసే ఉద్యోగిగా భావిస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణంలోని కొండా బాలకృష్ణారెడ్డి గార్డెన్‌లో ఎంపీ విశ్వేశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికై ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, అందరం కలిసి బంగారు తెలంగాణకై కృషి చేద్దామని, అందరం సమిష్టిగా పనిచేస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా 10 వేల మూసివేయని బోర్లున్నాయని గుర్తించగా,..ఇప్పటివరకు రెండు వేల బోర్లను మూసివేసినట్లు ఎంపీ తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగ యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకుగాను 50 యూత్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాలోని తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో కంది గిర్నిల ఏర్పాటుకు సాయమందిస్తానన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు తీసుకువచ్చిన కేక్‌ను కట్ చేయడంతోపాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ధారూర్ పీఏసీఎస్ చైర్మెన్ హన్మంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు భూమళ్ల కృష్ణయ్య, వేణుగోపాల్ రెడ్డి, రాందేవ్ రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.