నియంత పాలనకు చరమగీతం: మల్లు రవి

Mallu Ravi
Mallu Ravi

హైదరాబాద్‌: కేంద్రంలో,రాష్ట్రంలో నియంతల పాలన సాగుతోందని, ప్రజలు వీరికి చరమగీతం పాడేందుకు ఎదురు చూస్తున్నారని టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితులున్నాయని, ఈ సందర్భంగా రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపట్టారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని,పాలనలో బిజెపి, టిఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైయ్యాయని విమర్శించారు. మోడీ చర్యలతో దేశ అభివృద్ధి కుంటుపడిందన్నారు. కెసిఆర్‌ది హిట్లర్‌ పోకడ క్యాబినెట్‌ మంత్రులంతా డమ్మీలేనని అన్నారు. మోడీ కెసిఆర్‌తో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, ప్రధానిని కల్సిన సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. దేశంలో మళ్లీ అభివృద్ధి కాముక, ప్రజలు కోరుతున్న పాలన రావాలంటే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. నియంతల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఎమ్మెల్యే సంపత్‌ వ్యాఖ్యలపై మల్లు స్పందిస్తూ 2019తరువాత పిసిసి చీఫ్‌ అవుతానడంలో తప్పులేదన్నారు. 2019 వరకు ఉత్తమ్‌ పిసిసిగా ఉంటారన్నదే సంపత్‌ మాటల్లోని అంతర్యం అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు బేధాభిప్రాయాలకు తావులేదన్నారు.