ధన ప్రవాహంతోనే టీఆర్‌ఎస్‌ గెలిచింది

Bhatti
Bhatti

టీ పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ భట్టి
హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసిన కారణంగానే టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించిందని టీ పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రణాళికాబద్దంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో గ్రామ స్థాయి నేతల నుంచి ఉన్నత స్థాయి వరకు ముఖ్య నేతలను తమ పార్టీ నేతల ద్వారా సంప్రదించారనీ, అన్ని రకాలుగా ప్రయత్నించి వారందరినీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముందుగానే ఓటర్ల జాబితాను సేకరించి వారందరికీ డబ్బులు అందేలా చూశారని పేర్కొన్నారు. దీంతో పాటు డ్వాక్రా సంఘాలను తమ పార్టీకి ఓటు వేసేలా పై అధికారులతో ఒత్తిడి చేయించడం కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి దోహదం చేసిందని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ పక్షాన పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటించలేక పోవడం, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోవడం, పార్టీ నేతలు విఫలమయ్యారని చెప్పారు. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే ప్రజా కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరచిందనీ, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో ఇది అంతగా విజయవంతం కాకపోవడానికి పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని భట్టి పేర్కొన్నారు.