దమ్ముంటే రైతుబంధు బహిష్కరించండి: ఎమ్మెల్సీ కర్నె

Karne Prabhakar
Karne Prabhakar

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకులకు దమ్ముంటే ‘రైతుబంధు కార్యక్రమానికి తాము వ్యతిరకమని బాహటంగా ప్రకటించి చెక్కుల పంపిణీ ప్రక్రియను బహిష్కరించాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. సోమవారం టిఆర్‌ఎస్‌ఎల్పీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 మంది సిఎం అభ్యర్థులతో సాగుతున్న బస్సుయాత్రలో వారంతా ఒకేదగ్గర ఉన్నందున చర్చించుకుని రైతు బంధు నష్టం చేస్తుందని ఎక్కడికక్కడ ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ నాయకుల బస్సుయాత్ర ఒక సర్కస్‌ కంపెనీలా మారిందని, ప్రజలు ఆకట్టుకోవడానికి సర్కస్‌ఫీట్లు చేస్తున్నారనీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న తుపాకిరాముడి మాటలను ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు చెక్కుల పంపిణీ వాతావరణంలో సాగుతుందని, 80 ఏళ్ల నుంచి జరగని భూరికార్డుల ప్రక్షాళన సమగ్రంగా జరిగి ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ లేకుండా తమ ఇంటివద్దకే పాస్‌బుక్కులు వస్తుండటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. 43 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా రైతులు క్యూల్లో నిల్చొని చెక్కులు తీసుకుంటుంటే అదేసమయంలో కాంగ్రెస్‌ నాయకులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. మంచిర్యాల సభ సాక్షిగా కాంగ్రెస్‌ నాయకులు కారుకూతలు కూశారని, తాము అధికారంలోకి వస్తే పత్తికి రూ.6 వేలు, మిర్చికి రూ.10 వేల చొప్పున మద్దతు ధర ఇస్తామన్నారని కర్నె పేర్కొంటూ మద్దతు ధర ఇవ్వాల్సింది కేంద్రమన్న విషయం తెలియని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పదేళు పంటలకు ఎందుకు మద్దతు ధరలు ఇవ్వలేదో ముందు కాంగ్రెస్‌ నాయకులు చెప్పాలన్నారు. నిత్యం కొట్టుకునే కాంగ్రెస్‌ నాయకులనే సమన్వయం చేయలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజలను ఎలా సమన్వయం చేసి అధికారంలోకి వస్తారని ఆయన నిలదీశారు. సిఎం అవుతానని ఉత్తమ్‌ పగటికలలు కంటున్నారన్నారు. 2014లోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను పాతాళంలో బొందపెట్టారని, మళ్లీ ఆపార్టీ లేచి పైకొచ్చే అవకాశమే లేదన్నారు. 2009 ఎన్నికల సందర్బంగా సేద్యానికి 9గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పి 5 గంటలు కూడా ఇవ్వలేదని, మార్కెట్‌ స్థిరీకరణ నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పారని, ప్రకృతి ఫైపరిత్యాల సందర్బంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీలో ఆంధ్ర, తెలంగాణ అనే వివక్ష చూపారని, వారి హయాంలో రాయలసీమకు అప్పటి సిఎం అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే అడ్డుచెప్పడానికి బదులు ఎదురేగి హారతులు పెట్టారని ప్రభాకర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో పాలనలో వేలాది మంది రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనే రాలేదన్నారు.