తెలంగాణ‌ను అభివృద్ది ప‌థంలో తీసుకెళ్తున్న టిఆర్ఎస్‌

TRS 17 PLEANERY INAUGARATION
TRS 17 PLEANERY INAUGARATION

హైద‌రాబాద్ః టీఆర్ఎస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొంపల్లిలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌ ప్రారంభ ఉపన్యాసం చేశారు. పార్టీ స్థాపించిన సమయంలో ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కున్నామని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకెళ్లున్నామని అన్నారు. ఒంటరిగా వెళ్లి ఎన్నికల పోరులో విజయం సాధించామన్నారు. అధికారంలోకి వచ్చాక శాపనార్ధాలు పెట్టారని…అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు.
టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రధాని, పలువురు సీఎంల నుంచి ప్రశంసలు వచ్చాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ పథకాలను మాజీ ప్రధాని దేవెగౌడ అభినందించారన్నారు. 4వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేసీఆర్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆశా వర్కర్లకు దేశంలోనే అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణను తెచ్చిన పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు. ఏడు దశాబ్దాల పాటు ప్రజలను పీక్కుతున్న పార్టీ కాంగ్రెస్‌ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫలయత్నం చేయాలని కుట్ర పన్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి రాని అవార్డులు తెలంగాణను వరించాయన్న కేసీఆర్ ఇతరరాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమని నీతి ఆయోగ్‌ చెప్పిందని తెలిపారు.