తెలంగాణలో 2,500 రైతు సమావేశ మందిరాలు

Telangana
Telangana

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 రైతు సమావేశ మందిరాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సమావేశ మందిరానికి 12 లక్షల రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది. ఈవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోయే రైతు సమావేశ మందిరాలకు మొత్తం 2300 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిధులను 2018-19 వార్షిక బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవంగా సమావేశ మందిరాలకు సంబంధించి రెండు మూడు ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే సమర్పించారు. ఒక్కో రైతు సమావేశ మందిరానికి 25 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో రెండు రకాల ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అంచేశారు. అయితే సీఎం వాటిని కుదించినట్లు తెలియవచ్చింది. రైతు సమావేశ మందిరాలు ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదని, కేవలం సమావేశాలు నిర్వహించుకునేలా నిర్మాణాలు ఉంటే చాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే రైతు సమావేశ మందిరానికి ఒక్కొక్క దానికి 12 లక్షల రూపాయల మేర అంచనా వ్యయం అవుతుందని లెక్కకట్టి ఆమేరకు నిర్ణయించారు. మరోపక్క రాష్ట్రంలో ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి ఉన్నారు. ఆ ప్రకారం ప్రతీ మూడు గ్రామాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,500 మంది వ్యవసాయ విస్తరణాధికారులు ఉన్నారు. మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండే గ్రామంలో ఈ రైతు సమావేశ మందిరాలను నిర్మిస్తారు. గ్రామంలో దాతల ద్వారా స్థలాలను సేకరించే అవకాశం కూడా ఉంది. ఆ స్థలంలోనే రైతు సమావేశ మందిరాలను నిర్మింప చేస్తారు. సమావేశ మందిరంలో మైకు, కుర్చీలు తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా తీర్చిదిద్దుతారు. ఆ మూడు గ్రామాలకు చెందిన రైతు సమన్వయ సమితి సభ్యుల సమావేశాలు ఆ మందిరంలోనే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా రైతులకు శిక్షణ, వివిధ పథకాలపై అవగాహన వంటి కార్యక్రమాలు ఈ మందిరాల్లోనే నిర్వహించనున్నారు. దీంతో వ్యవసాయ విస్తరణాధికారుల క్లష్టర్లు కీలకం కానున్నాయి. ఇప్పటి వరకూ మండల స్థాయిలోనూ ఇటువంటి రైతు సమావేశ మందిరాలు లేవు. కనీసం వ్యవసాయ శాఖ అధికారులకు కూడా మండల కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ఛాంబర్లు లేవు. అటువంటిది మూడు గ్రామాలకు కలిపి ఒక సమావేశ మందిరాన్ని నిర్మిస్తుండడంతో రైతుల వద్దకు ప్రభుత్వ పథకాలు చేరే వీలుంటుందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.