తెర‌పైకి తెరాస నేత‌ల వర్గ విబేధాలు

disputes in TRS
disputes in TRS

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో తెరాస నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ సారి ఏకంగా పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లాయి. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ తనయుడు జగన్‌పై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి తనయుడు జగన్‌ తనను దూషిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌ పంపారని ఈ నెల 9న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పోలీస్‌ కమిషనర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు తన మామ బాజిరెడ్డిపైనా, తనపైన‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని అదే రోజు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సంపత్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులపై నిన్న రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, బాజిరెడ్డి జగన్‌లపై బెదిరింపుల సెక్షన్‌ కింద కేసులు పెట్టారు.