చివరి ఆయకట్టుకూ యాసంగిలో నీరు

WATER FALLS
WATER

చివరి ఆయకట్టుకూ యాసంగిలో నీరు

హైదరాబాద్‌: ప్రస్తుత యాసంగి సీజనులో చివరి ఆయకట్టు వరకూ సాగు నీటిని అందిస్తామని మార్కెటింగ్‌, ఇరిగేషన్‌ మంత్రి టి హరీష్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు కింద యాసంగిలో ఎల్‌ఎండికి ఎగువన నాలుగు లక్షల ఎకరాలకు, ఎల్‌ఎండికి దిగువున 1.15 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సంద ర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ లక్ష్యాలను సాధిస్తూనే మిషన్‌ భగీరధ పథకానికి కేటాయించిన నీటిని జలాశయాల్లో కాపాడుకోవాలని సూచించారు. శ్రీరామ్‌సాగర్‌ జలాశయం నుండి ఇప్పటికే ఏడు తడులకు నీరిచ్చామన్నారు. మరో నాలుగు తడులకు నీరి వ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎల్‌ఎండికి పైన ఉన్న నాలుగు లక్షల ఎకరాలకు చివరి భూములకు కూడా నీరు అందించేందుకు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాలువలపై రాత్రివేళల్లో కూడా గస్తీని నిర్వహించాలని, అక్రమంగా తూములు పగల కొట్టకుండా, కాలువలు వదలకుండా, గేట్లు ఎత్త కుండా చూడాలని స్పష్టం చేశారు.

అవసరమైతే పోలీస్‌, రెవెన్యూ అధికారుల సహాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువుల కింద ఆయకట్టుని, పంపుల ద్వారా సాగు చేసుకుంటున్న ఆయకట్టుని కూడా లెక్కలోకి తీసుకోవాలన్నారు. రెవెన్యూ వారితో కలిసి చేసే జాయింట్‌ అజమాయిషీలో కూడా నమోదు చేయాలని ఆదేశించారు. ఏప్రియల్‌ 16వ తేదీకి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువను మూసివేయాలని, మార్చి 20కు ఎల్‌ఎండి కాలువ మూసివేయాలన్నారు. శ్రీరాంసాగర్‌ జలా శయం నుండి నీటిని పంపుచేసే ముందు తప్పని సరిగా చీఫ్‌ ఇంజనీర్ల అనుమతి తీసుకోవాలని ఐడిసి ఇంజనీర్లకు స్పష్టం చేశారు. నాగార్జున సాగర్‌ కింద యాసంగిలో ఐదు లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించాలనే లక్ష్యంగా పెట్టుకు న్నట్లు ఆయన వివరించారు.