ఎమ్మెల్యే సంపత్‌ గృహ నిర్బంధం దారుణం

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

దళితుడనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు
హైదరాబాద్‌: అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ గృహనిర్భంధం దారుణమని, ఇది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిరంకుశత్వానికి పరాకాష్ట అని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఒక దళిత శాసనసభ సభ్యుడిని గృహ నిర్భంధం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సంపత్‌ పోరాడి సాధించారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు.దళిత ఎమ్మెల్యే సంపత్‌ను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వేధిస్తోందని, ఇందులో భాగంగానే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిందని ధ్వజమెత్తారు. హైకోర్టు రెండు సార్లు ఆదేశించినా కెసిఆర్‌ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను దిక్కరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననివ్వాలని, తన నియోజకవర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులు భారీగా పోలీసులను మోహరించారు.
రాష్ట్రంలో అణచివేత కొనసాగుతోంది
ఎమ్మెల్యే సంపత్‌ గృహ నిర్బంధాన్ని ఖండించిన జానారెడ్డి
రాష్ట్రంలో నెలకొన్న అప్రజస్వామిక అణచివేత పరిస్థితులు గత 70ఏళ్లలో ఎన్నుడూ లేనంతగా ఉన్నాయని సిఎల్పీనేత జానారెడ్డి అన్నారు.శుక్రవారం టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ గృహ నిర్బంధాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను వినేందుకు, మెమోరాండంలు స్వీకరించేందుకు, ప్రజాస్వామ్యయుతంగా నిరసలు తెలిపేందుకు అవకాశం లేకుండా అణచివేస్తున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు తెగబడి ప్రజాస్వామ్య విధానాలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. సిఎంను కలవడానికి అనుమతివ్వరు, సభ పెట్టుకోవడానికి అనుమతించరు నియంత పాలనలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని మండిపడ్డారు. ఒక్క రాజకీయ పార్టీలనే కాదు, ప్రజా సంఘాలను, మీడియాను ఈ ప్రభుత్వం నిర్భంధిస్తుందని ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకోకుండా ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎప్పుడు అంతమొందించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాలు రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. సమ్మేకు వెళుతున్న రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆలోచించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుందన్నారు.