ఆయిల్ ట్యాంక్ పేలుడులో గాయాలైన వెంక‌టేష్ మృతి

Oil Tank Blast
Oil Tank Blast

మేడ్చల్‌: ఆగిఉన్న ఆయిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను అక్రమంగా దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా మంటలు అంటుకొని పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ భారీ పేలుడులో మంటల ధాటికి మేడిపల్లి నుంచి చెంగిచర్ల వైపు వెళ్తున్న బాటసారులు, వాహనదారులకు సైతం గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వెంకట్‌నాయక్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు. వెంకట్‌ స్వస్థలం కర్నూలు జిల్లా హుస్సేనీపురం. వెంకట్‌ నాయక్‌ ఎంటెక్‌ చదివాడు. వెంకట్ నాయక్ చనిపోయినట్లు తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. హుస్సేనీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం గాంధీ నుంచి వెంకట్ స్వగ్రామానికి మృతదేహాన్ని తరలిస్తారని తెలిసింది. కాగా ఈ పేలుళ్లలో మొత్తం 12 మంది గాయపడ్డారని తెలుస్తోంది. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భోజనం కోసం ఇంటికెళ్తుండగా ఘటన.. కాగా.. కర్నూలుకు చెందిన వెంకట్ మేడిపల్లిలో నివాసం ఉంటూ చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చి తిరిగి డిపోకు వెళ్తుండగా మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో వెంకటేశ్ హెల్మెట్ పెట్టుకోవడంతో తలకు గాయాలేమీ కాలేదు. హెల్మెట్ తీయలేక, ఒళ్లంతా గాయాలతో అతడు పడిన వేదన స్థానికులను కంటతడి పెట్టించింది. 60 శాతం పైగా కాలిన గాయాలతో వెంకట్ నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి వెంకట్ కన్నుమూశాడు.