భావోద్వేగానికి గురైన స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి

నోట మాట రాక క‌న్నీళ్లు పెట్టుకున్న పోచారం

pocharam srinivas reddy

బాన్సువాడ‌ : టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి శ‌నివారం తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. కార్య‌క‌ర్త‌లు, అధికారుల ముందే ఆయ‌న ఏడ్చినంత ప‌నిచేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ‌లోని పోచారం నివాసంలోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే… త‌న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను స‌మీక్షించే నిమిత్తం శ‌నివారం వివిధ శాఖల అధికారుల‌తో పాటు పార్టీ కార్య‌క‌ర్త‌లు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పోచారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వ‌ల ద్వారా విడ‌త‌ల వారీగా నీటిని విడుద‌ల చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

అనంత‌రం నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలో ప‌క్కా ఇళ్ల నిర్మాణంపై చ‌ర్చిస్తున్న సంద‌ర్భంగా టీఆర్ఎస్ జ‌డ్సీటీసీగా ఉన్న స‌తీశ్ ప‌క్కా ఇళ్ల నిర్మాణంలో మంచి పురోగ‌తి సాధించారని పోచారం చెప్పారు. ఈ సంద‌ర్భంగా స‌తీశ్‌ను అభినందిస్తున్న క్ర‌మంలోనే పోచారం తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నోట మాట రాక క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/