లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు తెగిపోయాయి. పంటపొలాలు నీటమునిగాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నీటిలో మునిగాయి. నేడూ, రేపూ భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ తరుణంలో తెలంగాణ మంత్రులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కొరముని నర్సింహులుతో కలిసి రామయ్యబౌలి, బీకే రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిర్మల్ పట్టణంలోని వర్ష ప్రభావిత ప్రాంతంలో రెండో రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. డ్రైనేజీలో ఎప్పటికప్పుడు పూడిక తీయాలని, రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. మరోపక్క భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిసు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెకర్లు, సంబంధితశాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సూచించారు.