తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల చేసిన విద్యా శాఖ

కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టడం తో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ దూకుడు పెంచింది. రీసెంట్ గా పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయగా..సోమవారం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ ఏడాది రెండు టర్మ్స్ గా ఇంటర్ అకడమిక్ ఇయర్ ఉండనున్నట్లు పేర్కొంది. మొదటి టర్మ్ సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 18 వరకు ఉండనుండగా.. ఈ ఏడాది ఇంటర్ లో అర్థ సంవత్సరం పరీక్షలు నిర్వహించబోతుంది.

ఇక అక్టోబర్ 13 నుండి 17 వరకు దసరా సెలవులు ఉన్న నేపథ్యం లో డిసెంబర్ 13 నుండి 18 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు పరీక్షలు నిర్వహించబోతుంది. అలాగే డిసెంబర్ 20 నుండి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉండనుంది. ఇక జనవరి 13 నుండి 16 వరకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో.. మార్చి 23 నుండి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనుంది విద్యా శాఖ. ఈ ఏడాది వంద శాతం సిలబస్ పూర్తి చేస్తామని.. సిలబస్ ఎలాంటి తగ్గింపు లేదని విద్యా శాఖ తెలిపింది.

ఇక అకడమిక్ క్యాలెండర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్ 23 వ తేదీ 2022 చివరి పని దినం గా తెలిపారు. దసరా సెలవులు అక్టోబర్ 6 నుండి 17 వరకు (12 రోజులు) , డిసెంబర్ 22 నుండి 28 డిసెంబర్ వరకు (7 రోజులు) మిషనరీ స్కూల్స్ కి క్రిస్మస్ సెలవులు, జనవరి 11 నుండి 16 వరకు (7 రోజులు) మిషనరీ స్కూల్స్ మినహా సంక్రాంతి సెలవులు ఉండనున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్ లో పదవ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.