హోంగార్డులకు కేసీఆర్ సర్కార్ తీపికబురు..30 శాతం వేతనం పెంపు

తెలంగాణ హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హోంగార్డుల గౌరవవేతనాలను 30 శాతం వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల గౌరవవేతనాలను పెంచుతూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించింది. తాజాగా వీటికి సంబంధించిన స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. హోంగార్డుల‌కు పెరిగిన వేత‌నాలు 2021, జూన్ నుంచి అమ‌లు కానున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి హోంగార్డులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

హోంగార్డుల జీతాలు పెంచడం తో పాటు, వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసు శాఖలో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అత్యంత మానవత్వంతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇదే క్రమంలో ఇప్పుడు హోంగార్డుల అపరిష్కృత సమస్యలెన్నో పరిష్కరించారని హోంగార్డు సంక్షేమ సంఘం సంతోషం వ్యక్తం చేసింది.