న్యాయవాది దంపతుల హత్యపై స్పందించిన హైకోర్టు

ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నాం..సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలి..హైకోర్టు

హైదరాబాద్‌: హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. లాయర్ దంపతుల హత్య ఘటన తమ దృష్టిలో ఉందని, ఈ హత్యలపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ హత్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించింది.

లాయర్ల హత్య ప్రభుత్వంపై విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని ఆదేశించింది. నిందితులను త్వరగా పట్టుకోవాలని, నిర్దిష్ట కాలపరిమితితో హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులకే భద్రత లేకపోతే… సామాన్యుల పరిస్థితి ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాదులో రంగారెడ్డి జిల్లా కోర్టులు, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి కోర్టు, కూకట్ పల్లి కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నారు.


కాగా, న్యాయవాదులు వామనరావు, ఆయన భార్యను దుండగులు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద పట్టపగలే రోడ్డుపై పలవురు చూస్తుండగా కత్తులతో పొడుస్తూ అత్యంత కిరాతకంగా వారిని హత్య చేశారు. ఈ హత్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు విధులను బహిష్కరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/